Spondylitis : సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్ని వేధించే ఈ స‌మ‌స్య‌కు పరిష్కారాలు

‘డిజిటల్‌ లైఫ్’ స్పాండిలైటిస్‌ సమస్యలకు దారి తీస్తోంది. ప్రతీ 10మందిలో 7 గురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. జీవనశైలిని మార్చుకుంటే ఈ సమస్యల నుంచి బయపడొచ్చంటున్నారు నిపుణులు.

Spondylitis Problem : మారుతున్న కాలంలో డిజిటల్‌ లైఫ్ మనిషికి ఎన్నో ఆరోగ్య సమస్యలకు గురిచేస్తోంది.మనిషి జీవన శైలిలో వస్తున్న పెనుమార్పులు అతి తక్కువ వయస్సుకే దీర్ఘకాలిక సమస్యలకు గురిచేస్తున్నాయి. శారీరక శ్రమ తగ్గిపోయి గంటల తరబడి కుర్చీలకే అతుక్కుపోయి చేసే పనులు ఈ సమస్యలకు దారితీస్తున్నాయి. దీనికి తోడు కొత్త వ్యసనాల అలవాట్లు.

ముఖ్యంగా ‘డిజిటల్‌ లైవ్’ మెడ, నడుము వంటి కీలక భాగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. మెడ, నడుము నొప్పులు వంటివి జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల వచ్చేవే. ప్రతి పదిమందిలో ఏడుగురికి ‘స్పాండిలైటిస్‌’ సమస్య ఉంది. అంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఊహించుకోవచ్చు. ముఖ్యంగా సాఫ్టు వేర్ ఉద్యోగుల్లో ఈ సమస్య పెరుగుతోంది.కొంచెం శ్రద్ధపెడితే ఈ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.

మనిషి కండరాలు యంత్రాల్లాగా నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. లేదంటే మొండికేస్తాయి. తరువాత లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిత్యం పనిచేస్తుంటేనే శరీరకంగా ఉత్సాహంగా ఉండగలం..తద్వారా శారీరక వ్యవస్థ బలంగా ఉంటుంది. కానీ.. టెక్నాలజీ పెరిగిపోయాక శారీరక శ్రమ తగ్గిపోయింది. ఒకే చోట కూర్చుని పనిచేయటం సర్వసాధారణమైపోయింది.ఉద్యోగులు కుర్చీలకే పరిమితం అవుతున్నారు. ఇలా ఒకేచోట కూర్చోవడం వల్ల కండరాలకు వ్యాయామం లేకుండాపోవటంతో అవి మొండికేస్తుంటాయి.

కూర్చుని కూర్చుని సడెన్ గా లేవాలంటే ఇబ్బంది.నాలుగు అడుగులు వేయాలంటే ఇబ్బంది. గంటల తరబడి కూర్చుని పనిచేస్తుంటే శరీరంలో ప్రధాన భాగాలు స్టక్ అయిపోతాయి. బలహీనపడిపోయి సున్నితంగా మారిపోతాయి. బరువైన పనిచేయలేం. ఒకవేళ అలా చేయాల్సి వచ్చినా..ఎక్కువ దూరం నడవాల్సి వచ్చినా ఇట్లే అలసిపోతారు. కాళ్లు నొప్పులు తప్పనిసరి..దీనికి తోడు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఈ క్రమంలో వెన్నుపూసలోని డిస్కులు దెబ్బతింటాయి. ఈ పరిస్థితినే ‘స్పాండిలైటిస్‌’ అంటారు. అపసవ్య జీవన విధానమే స్పాండిలైటిస్‌కు ప్రధాన కారణం.

నడుములోని వెన్నుపూస, డిస్కులు అరిగిపోవడం వల్ల నడుము నొప్పి బాగా వస్తుంది. మెడలోని డిస్కులు అరిగిపోవడం వల్ల మెడ నొప్పి నిత్యం వేధిస్తుంటుంది. మెడలోని డిస్కులు అరిగిపోతే దాన్ని ‘సర్వైకల్‌ స్పాండిలైటిస్‌’ అంటారు. నడుము వద్ద ఉన్న డిస్కులు జారిపోతే ‘లంబార్‌ స్పాండిలైటిస్‌’ అంటారు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం, సమస్య మరింత ఎక్కువైపోతుంది. తీవ్ర అనారోగ్యానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలతో కాస్త కదులుతూ..నడుస్తూ పరిగెడుతుండాలి.

20 ఏళ్ల క్రితం వరకూ స్పాండిలైటిస్‌ అనేది 50 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే వచ్చేది. వయసు పైబడి డిస్కుల అరుగుదలతో నొప్పులు వచ్చేవి. కానీ కాలక్రమంలో జీవనశైలి లోపాలు..వృత్తిపరమైన ఒత్తిళ్లు వంటి పలు కారణాలతో యువతకు స్పాండిలైటిస్‌ సమస్య వస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌, బ్యాంకింగ్‌, కాల్‌సెంటర్‌ వంటి ఉద్యోగులకు ఇది ఎక్కువగా ఉంటోంది. నడుము, మెడ నొప్పి బాధలు వేధిస్తున్నాయి.

జీవనశైలి కారణాల వల్ల భౌతిక శ్రమ తగ్గినప్పుడు, ఆ నష్టాన్ని కవర్ చేయటానికి కచ్చితంగా వ్యాయామం చేయాల్సిన అవసరం చాలా ఉందని చెబుతున్నారు నిపుణులు. ప్రతీరోజు నడక, యోగావంటివి చేయాలి. కనీసం రోజుకు అర్థగంటపాటు చేయాల్సిన అవసరం ఉంది. నడక నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి. కానీ తీవ్ర పని ఒత్తిడి వల్లనో, బద్ధకంతో సమయం కేటాయించలేని పరిస్థితి. పెరిగిన వర్కింగ్ టైమింగ్స్, నిద్ర పట్టకపోవటం. నిద్రపట్టినా నిద్రలో కూడా వెంటాడే డెడ్‌లైన్లు కలవరపరుస్తున్నాయి. రోజుకు 10 నుంచి 15 గంటలపాటు సీట్లకే అతుక్కుపోతుండటంతో చిన్న వయస్సులోనే అనారోగ్య సమస్యలకుగురవుతున్నారు. మిగతా సమయాన్ని టీవీలు, సెల్‌ఫోన్లతో బిజీ బిజీ.

కరోనా ప్రభావం..Work Form Home
కరోనా వేవ్స్ కొనసాగుతున్న క్రమంలో దాదాపు రెండేళ్ల నుంచి పిల్లలు కూడా స్కూళ్లకు వెళ్లేది లేకపోవటంతో నాలుగు గోడలకే పరిమితం అవుతున్నారు. ఆన్ లైన్ క్లాసుల పేరుతో గంటల తరబడి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతోనే సరిపోతోంది. చిన్నారుల కండరాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఫలితంగా చిన్న వయసులోనే నడుము, మెడ నొప్పులతో బాధలు.

దీంతో 30-40 ఏళ్లకే డిస్క్‌లు అరిగిపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. కండరాల ఎదుగుదల కూడా దెబ్బతినే అవకాశముందంటున్నారు. అలాగే కరోనా వైరస్‌ బారినపడి, కోలుకున్న వారిలో కండరాల సమస్యలు, కీళ్లనొప్పులు బయటపడుతున్నాయి. దీన్నే ‘ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్‌’ అంటారు.. అంటే, వాతంతో కూడిన నొప్పులు. స్పాండిలైటిస్‌ సమస్యలకు జీవన విధానంలో మార్పులు చేసుకుంటే వీటిబారి నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు నిపుణులు.ఫిజియోథెరపీ, హైడ్రో థెరపీ, యోగా థెరపీ, ఆహార నియమాల్లో మార్పులు చాలా ముఖ్యం. జీవనశైలి మార్పుల ద్వారా జీవితాన్నే మార్చేసే అద్భుత విధానం ఇది.

వ్యాయామాలు..మార్చుకోవాల్సిన ఆహార నియమాలు..
వ్యాయామం చేయాలి లేదా యోగా తరువాత బార్లీ నీళ్లు తాగాలి. దీనివల్ల శరీరంలోని మలినాలు బయటకు పోతాయి.మొలకెత్తిన గింజలు (శెనగలు, పెసర్లు, పల్లీ), మష్రూమ్‌, పనీర్‌, సోయా తదితర ప్రొటీన్‌ పోషకాలు తీసుకోవాలి. ఇవి తింటే కండరాలు బలపడతాయి.

డ్రై ఫ్రూట్స్‌, డ్రై నట్స్‌,నానబెట్టిన బాదం, పిస్తా, వాల్‌నట్స్‌ తినాలి. ఇవి ప్రతీరోజు తింటే నరాలు బలంగా మారతాయి.పాలు, పెరుగు, ఆకు కూరలు, అవిసె గింజలు, రాగి జావ తీసుకుంటే ఎముకల బలానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ 3 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగాలి. నీరు తాగటం వల్ల కండరాలు బిగుసుదనం తగ్గుతుంది.

యోగ చికిత్స
మెడనొప్పి కోసం నిత్యం.. మెడను నెమ్మదిగా ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి 10 సార్లు తిప్పాలి. తరువాత కింద నుంచి పైకి, పై నుంచి కిందికి 10 సార్లు, కుడి భుజం నుంచి ఎడమ భుజం వైపునకు, ఎడమ నుంచి కుడి భుజం వైపునకు 10 సార్లు వంచాలి. దిగువ తెలిపిన ఆసనాలను కూడా నిపుణుల పర్యవేక్షణలో సాధన చేయాలి.

అలాగే యోగాలో ఉండే పలు రకాల ఆసనాలు మెడ, నడుము నొప్పుల నుంచే కాకుండా పలు సమస్యల నుంచి బయటపడేలా చేస్తాయి. యోగా ఆసనాలు నిపుణుల పర్యవేక్షణలో చేస్తేనే మంచిది. లేదంటే లేనిపోయిన సమస్యలు వచ్చే అకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి నిపుణుల పర్యవేక్షణలో యోగా చేయటం చాలా మంచిది.

ట్రెండింగ్ వార్తలు