కులభూషణ్ విషయంలో నీ ఛాతీ 12 అంగుళాలకు ముడుచుకుందా!

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరోసారి ఫైర్ అయ్యారు.మండుతున్న ఎండలో 79ఏళ్ల వయస్సుని లెక్క చేయకుండా  లోక్ సభ ఎన్నికల క్యాంపెయిన్ మొదలైనప్పటి నుంచి బ్రేక్ తీసుకోకుండా రోజుకి నాలుగు మీటింగ్స్ లో పాల్గొంటూ పార్టీ విజయం కోసం పవార్ చెమటోడుస్తున్నారు.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-28,2019)పూణే శివార్లలోని తాలేగాన్ దబ్డే సిటీలో నిర్వహించిన ర్యాలీలో పవార్ మోడీపై ఫుల్ సీరియస్ అయ్యారు.మహారాష్ట్ర రైతుల సమస్యలు,నిరుద్యోగం,నోట్ల రద్దు,జాతీయ భద్రత,పుల్వామా,బాలాకోట్ అంశాలపై మోడీపై పవార్ విమర్శనాస్త్రాలు సంధించారు.పాకిస్తాన్ దురాక్రమణ నుంచి భారత్ ను కాపాడింది లాల్ బహదూర్ శాస్త్రి అని పవార్ గుర్తు చేశారు.పాకిస్తాన్ ని రెండుగా విభజించింది ఇందిరాగాంధీ అని అన్నారు. తాను వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మహారాష్ట్రలోని యవత్మాల్ లో  ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబాన్ని పరామర్శించారని,అనంతరం ఢిల్లీ వెళ్లిన తర్వాత 70వేల కోట్ల రైతుల రుణాల మాఫీ నిర్ణయాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకుందని పవార్ తెలిపారు.మోడీ ఒక్క రైతు కుటుంబాన్నైనా పరామర్శించారా అని పవార్ ప్రశ్నించారు.

ఐఏఎఫ్ పైలట్ విక్రమ్ అభినందన్ భారత్ కు తిరిగివచ్చిన క్రెడిట్ మోడీ తీసుకున్నాడని,అయితే జెనీవా ఒప్పందం ప్రకారం పాక్ అభినందన్ ను విడుదల చేయాల్సి వచ్చిందని,ఇదే నిజమని పవార్ అన్నారు.మోడీ చెబుతున్నట్లుగా ఆయన వల్ల అభినందన్ భారత్ కు తిరిగి రాలేదన్నారు. తాను పార్లమెంట్ లో ఓ విషయాన్ని మోడీని అడగబోతున్నానని…56 అంగుళాల ఛాతీ  ఉందని మోడీ తరచూ చెబుతుంటాడని,అయితే పాక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న మహారాష్ట్ర వ్యక్తి కుల భూషణ్ జాదవ్ ని భారత్ కు తిరిగి తీసుకొచ్చే విషయంలో ఆ ఛాతి 12 అంగుళాలకు ముడుచుకుని పోయిందా అని పవార్ విమర్శించారు