Sharad Pawar North India Mentality Remark On Women Quota In Parliament
Women Quota: మహిళా రిజర్వేషన్ బిల్లు ఏనాటి నుంచో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. పార్లమెంట్ తలుపు బయటే ఆగిపోయిన ఈ బిల్లును ప్రస్తావిస్తూ ఉత్తర భారతీయుల మనస్తత్వం అందుకు అనుకూలంగా ఉండదంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ నేతగా ఉన్నప్పుడు బిల్లు ప్రవేశపెడితే మెజారిటీ ఎంపీలు దీనికి మద్దతు ఇవ్వలేదని, వెనక్కి తిరిగి చూసే సరికి తన పార్టీ ఎంపీలే వెళ్లిపోయారని తెలిపారు. శనివారం పూణె డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి పవార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో ఆయన కూతురు, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే సైతం హాజరయ్యారు.
కాగా, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శరద్ పవార్ మాట్లాడుతుండగా.. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ప్రశ్నించారు. పార్లమెంట్, అసెంబ్లీలల్లో ఎందుకు ఈ బిల్లు ఆమోదం పొందలేకపోతోందని, కారణలేంటని పవార్‌ను అడిగారు. ఈ ప్రవ్నకు పవార్ స్పందిస్తూ ఈ దేశ మనస్తత్వం సముఖంగా లేకపోవడం వల్లే మహిళా బిల్లు ఆమోదం పొందడం లేదని, మహిళా నాయకత్వాన్ని అంగీకరించేందుకు సముఖంగా లేరని సమాధానం చెప్పారు. అంతే కాకుండా ఈ బిల్లుపై పార్లమెంట్, అసెంబ్లీలో తన అనుభవాలను పంచుకున్నారు.
‘‘పార్లమెంట్ మనస్తత్వం, ముఖ్యంగా ఉత్తర భారత మనస్తత్వం సముఖంగా ఉండదు (ప్రత్యేకించి మహిళా బిల్లు విషయంలో). నేను కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు లోక్‌సభలో జరిగిన ఒక సన్నివేశాన్ని చెప్తాను. మహిళా బిల్లు ప్రవేశ పెట్టాను. ఈ బిల్లుపై నా ప్రసంగం పూర్తి చేసి వెనక్కి తిరిగి చూసే సరికి మా పార్టీ ఎంపీలే లేచి వెళ్లిపోయారు. దీన్ని బట్టి.. ఈ బిల్లు నా పార్టీ ఎంపీలకే జీర్ణం కాలేదని నాకు అర్థమైంది’’ అని అన్నారు. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ‘‘నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో (జిల్లా పరిషద్, పంచాయతి సమితి) మహిళలకు రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టాము. వాస్తవానికి మొదట దీనికి ఎవరూ సముఖంగా లేరు. కానీ తర్వాత అంగీకరించారు’’ అని శరద్ పవార్ అన్నారు. పవార్ వ్యాఖ్యలపై ఉత్తర భారత రాజకీయ నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Cong Proposed Rahul As Party Chief: రాహుల్ అధ్యక్షుడిగా రెండు రాష్ట్రాల కాంగ్రెస్ ఏకగ్రీవ తీర్మానం