sharad pawar
Sharad Pawar Comments On EVMs: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేయగా.. డిప్యూటీ సీఎంలుగా ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఈవీఎంల కారణంగానే మహాయుతి కూటమి విజయం సాధ్యమైందని పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సైతం ఈవీఎంల గురించి ప్రస్తావించారు.
షోలాపూర్ జిల్లాలోని మార్కద్వాడి గ్రామంలో యాంటి-ఈవీఎం కార్యక్రమంలో శరద్ పవార్ పాల్గొని మాట్లాడారు. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈవీఎంలపై ప్రజల్లో విశ్వాసం లేదు. అమెరికా, ఇంగ్లండ్ సహా ప్రపంచమంతా బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ, భారతదేశంలో మాత్రమే ఈవీఎంలు ఎందుకు వాడుతున్నారని శరద్ పవార్ ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలంతా బ్యాలెట్లతోనే ఎన్నికలు నిర్వహించాలని కోరుకుంటున్నారని పవార్ పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. ఎంవీఏ ఎమ్మెల్యే శనివారం ప్రమాణ స్వీకారం చేసేందుకు నిరాకరించారు. ఎన్నికల్లో ఈవీఎంలను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ వారు ప్రమాణ స్వీకారం చేయలేదు. అయితే, ఆదివారం తిరిగి ఎమ్మెల్యేలుగా వారు ప్రమాణ స్వీకారం చేశారు.
శరద్ పవార్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. పవార్ అబద్ధాలు చెబుతూ మహారాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్ కులే మాట్లాడారు. మహారాష్ట్రలో ఈవీఎంల ద్వారా అనేకసార్లు ఎన్నికలు జరిగాయి. కానీ, ఎన్నికలను వారు ఎన్నడూ తిరస్కరించలేదు. శరద్ పవార్ ఓటమిని అంగీకరించాలి. ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. లోక్ సభ ఎన్నికల్లో వారు చెప్పిన అబద్ధాలన్నింటిని ప్రజలు తిరస్కరించారు. సీనియర్ రాజకీయ నేతగా ఉన్న వ్యక్తికి అబద్ధం చెప్పడం తగదు అంటూ పేర్కొన్నాడు.