తూర్పు లద్దాఖ్ లోని భారత్-చైనా సరిహద్దు గల్వాన్ లోయ ప్రాంతంలో జూన్ 15న చైనా-భారత్ సైనికుల మధ్య
తూర్పు లద్దాఖ్ లోని భారత్-చైనా సరిహద్దు గల్వాన్ లోయ ప్రాంతంలో జూన్ 15న చైనా-భారత్ సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో తెలంగాణ సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అయితే చైనా సైనికుల దురాఘతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వారు ఎంత అమానుషంగా వ్యవహరించింది బయటపడుతోంది. చైనా సైనికులు దొంగదెబ్బ తీశారు. పదునైన ఆయుధాలతో మన సైనికులపై అతి క్రూరంగా దాడి చేశారు. అమరులైన భారత జవాన్ల శరీరాలపై పదునైన ఆయుధంతో దాడి చేసిన తీవ్ర గాయాలున్నాయి. వారి దేహంలో అనేక భాగాలు విరిగిపోయాయి. ఇవన్నీ చైనా సైనికుల క్రూర దాడిని బహిర్గతం చేస్తున్నాయి.
శరీరంపై తీవ్ర గాయాలు, అనే చోట్ల ఫ్రాక్చర్స్:
సముద్రానికి 14వేల అడుగుల ఎత్తన ఉన్న లద్దాఖ్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతుంటాయి. మైనస్ డ్రిగీల ఉష్ణోగ్రతలు, ఆక్సిజన్ సరిగా అందకపోవడం, నీళ్లలో మునగడం వల్ల ఎక్కువమంది (12 మంది) సైనికులు చనిపోయారని సైనికాధికారులు తెలిపారు. చైనా సైనికులు మనవాళ్లను నీళ్లలోకి తోసేశారు, ఘర్షణ సమయంలో కొందరు నీళ్లలో పడిపోయారు, అమరులైన సైనికుల దేహాలు చూస్తే, వారు ఎంత గట్టిగా పోరాటం చేస్తారో అర్థమవుతుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. చైనా సైనికులను చాలామందిని మనవాళ్లు చంపినట్టు స్పష్టంగా తెలుస్తుందన్నారు. ”మన వాళ్ల శరీరాలపై పదునైన ఆయుధంతో దాడి చేసిన గాయాలు ఉన్నాయి. వారి దేహంలో అనేక చోట్ల ఫ్రాక్చర్స్ ఉన్నాయి” అని భారత సైనికుల మృతదేహాలను పరిశీలించిన లేహ్ సోనమ్ నుర్బో మెమోరియాల్ ఆసుపత్రి డాక్టర్ చెప్పారు.
మేకులు చుట్టిన ఇనుప రాడ్లు, కత్తులు, రాళ్లతో క్రూర దాడి:
కల్నల్ సంతోష్ బాబు శరీరంపై గాయాలు లేనప్పటికీ తల భాగంలో మాత్రం తీవ్రంగా కమిలిన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. నీట మునగడం వల్ల సంతోష్ బాబుతోపాటు మరో ఇద్దరు సైనికులు చనిపోయారని భావిస్తున్నారు. అమరులైన సైనికుల మృతదేహాలకు లేహ్‌లోని ఎస్ఎన్ఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మరికొంతమంది సైనికుల శరీరం, ముఖంపై తీవ్రగాయాలు ఉన్నాయని పోస్టుమార్టం నివేదికల్లో వెల్లడైంది. 17 మంది సైనికుల మృతదేహాలపైనా తీవ్ర గాయాలున్నాయని గుర్తించారు. మేకులతో కూడిన ఇనుప రాడ్లతో చైనా బలగాలు భారత సైనికులపై దాడి చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.
పక్కా పథకం ప్రకారమే డ్రాగన్ ఘాతుకం:
ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే చైనా బలగాలు గల్వాన్ లోయలో భారత సైనికులపై దాడి చేశాయనే విషయం పోస్టుమార్టం నివేదికను బట్టి అర్థమవుతోంది. మన సైనికులను రెచ్చగొట్టి ముందుగా తెచ్చుకున్న కత్తులు, ఇనుప రాడ్లు, ఫెన్సింగ్ చుట్టిన ఆయుధాలతో భారత సైనికులపై డ్రాగన్ దళాలు దాడులు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ముగ్గురు సైనికుల ముఖాలు గుర్తు పట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. మరో ముగ్గురి మెడ భాగంలో కోసిన గుర్తులున్నాయి. దాడిలో చైనా దళాలు కత్తులు కూడా ఉపయోగించినట్లు అర్థమవుతోంది.
నిలువెల్లా గాయాలైనా చైనా సైనికులపై సింహంలా గర్జించిన సంతోష్ బాబు:
భారత ప్రతిఘటన నేపథ్యంలో మన భూభాగానికి దగ్గరగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టును తొలగించిన చైనా.. ఉద్దేశపూర్వకంగానే మరోసారి ఆ చెక్ పోస్టును పెట్టడంతో వివాదం మొదలైంది. చైనా దళాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు కల్నల్ సంతోష్ బాబు నాయకత్వంలోని భారత సైనికులు. అయితే, అప్పటికే దాడికి కుట్ర పన్నిన చైనా బలగాలు వెంటనే భారత సైన్యంపై రాళ్లు, ఇనుపరాడ్లు, కత్తులు లాంటి పదునైన ఆయుధాలతో దాడులు చేశాయి. వాళ్లు 350మంది, మనం 100మంది.. చుట్టూ శత్రుబలగాలు, రాళ్ల దెబ్బలు, ఒంటి నిండా గాయాలు.. అయినా మన వాళ్లు వెనక్కి తగ్గలేదు. చైనా సైనికులను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఈ ఘర్షణలో భారత్ వైపున 20 మంది సైనికులు అమరులవగా.. చైనాకు చెందిన సుమారు 43 మంది సైనికుల హతమయ్యారని తెలుస్తోంది. తమ వైపు మరణాలపై చైనా ఇప్పటికీ అధికారిక ప్రకటన చేయలేదు. ఓ వైపు చర్చలంటూనే దాడులు చేయడంపై డ్రాగన్ దేశంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాగా మన సైనికులను ముందుండి నడిపించిన కల్నల్ సంతోష్ బాబు లోని నాయకత్వ లక్షణాలు, శౌర్య పరాక్రమాలు తీవ్ర ఉద్వేగానికి గురి చేస్తున్నాయి. రాళ్ల దెబ్బలు తగిలి నిలువెల్లా గాయాలైనా పోరాటస్ఫూర్తిని వీడకుండా చైనా సైనికులపై సింహంలా గర్జించి ఆ వీరుడికి ప్రతీ భారతీయుడు పిడికిలి బిగించి సెల్యూట్ చేయాలి.
Read: ఇండో-చైనా సైనికుల ఘర్షణ తర్వాత అద్భుతంగా మాట్లాడారు, ప్రధాని మోడీపై చైనా మీడియా ప్రశంసల వర్షం