Fadnavis-Pawar Meeting : మహా పాలిటిక్స్ లో వారి భేటీపైనే చర్చ

మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ను ముంబైలోని ఆయన నివాసంలో కలవడం మరోసారి మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

Fadnavis-Pawar Meeting మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ను ముంబైలోని ఆయన నివాసంలో కలవడం మరోసారి మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వీరి భేటీ..రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారితీయొచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో పవార్ తో భేటీపై దేవేందర్ ఫడ్నవీస్ స్పష్టతనిచ్చారు. ఇటీవల శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న పవార్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్లు సమావేశం అనంతరం ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. పవార్ ను కలిసిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు ఫడ్నవీస్.

మరోవైపు, మరాఠాలకు విద్యా సంస్థలతో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కోటాను కల్పిస్తూ మహారాష్ట్రలో చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసిన విషయం తెలిసిందే. అత్యంత సున్నితమైన రిజర్వేషన్ల అంశాన్ని నేరవేర్చడంలో ఉద్ధవ్ సర్కారు విఫలమైందని ఫడ్నవీస్, మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్‌లు కొద్ది రోజులుగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. రిజర్వేషన్లపై మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం(శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి) సరైన వాదనలు వినిపించలేదని ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తోంది. దీనికి నిరసనగా జూన్ 5న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు కూడా బీజేపీ సిద్ధమయ్యింది. ఇటువంటి సమయంలో పవార్-ఫడ్నవీస్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక, కరోనా వైరస్ కట్టడి విషయంలో కూడా ఉద్దవ్ సర్కార్ తీరును ఫడ్నవీస్ తీవ్రంగా విమర్శిస్తున్నారు.

అయితే, మంచి ప్రతిపక్ష నాయకుడిగా ఎలా ఉండాలనే దానిపై సోమవారం జరిగిన భేటీలో శరద్ పవార్..ఫడ్నవీస్ కు సలహా ఇచ్చి ఉంటారని మంగళవారం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్రంలో ఏదైనా కొత్త రాజకీయ మార్పులు ఉండే అవకశామే లేదన్నారు. “మహారాష్ట్రలో ‘ఆపరేషన్ లోటస్’ గురించి మరచిపోవాలని..అది ఇక్కడ జరగదని ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ సంజయ్ రౌత్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు