కేరళలో భారీ వర్షాలకు పెరియార్ నది ఉగ్రరూపం దాల్చింది. ఉప్పొంగి ప్రవహిస్తోంది. పెరియార్ నది వర ప్రవాహంతో అలువాలోని శివాలయం నీట మునిగిపోయింది. కేవలం దేవాలయం పైభాగం మాత్రమే బైటకు కనిపిస్తోంది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరద ఉదృతి కొనసాగుతోంది. ముఖ్యంగా భారీ వర్షాలకు ఇడుక్కి జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. విరిగిపడిన కొండచరియల్లో 80 మంది చిక్కుకుపోయినట్లుగా అధికారులు భావిస్తున్నారు. వారిని సురక్షితంగా బైటకు తీసుకురావటానికి అధికార యంత్రాంగా తీవ్రంగా పనిచేస్తోంది. కానీ అది ఎంతవరకూ సాధ్యమో తెలియాల్సి వుంది.
ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, కోజికోడ్, వయనాడ్, కన్నూరు, కాసర్‌గడ్ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ అంటే అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు..ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
రాష్ట్రంలో కురుస్తున్నభారీ వర్షాలకు ఏర్నాకులం జిల్లాలో వరదలు ముంచెత్తుతుండటంతో వరద నీటిలో ఓ ఏనుగు కొట్టుకుపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.నేరిమంగళం ప్రాంతంలో ఒక్కసారిగా వరద నీరు పెరగడంతో ఆ వరద నీటిలో ఏనుగు సైతం కొట్టుకుపోయింది.