Siddaramaiah Slapgate Row: నిండు సభలో కొట్టబోయిన సీఎం.. ఏఎస్సీ సంచలన నిర్ణయం.. అవమానం తట్టుకోలేకపోతున్నా అంటూ..

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.

Siddaramaiah Slapgate Row: ఓ బహిరంగ సభలో అందరి ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ పోలీస్ పై చెయ్యి ఎత్తిన ఘటన కర్నాటకలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ధార్వాడ జిల్లా ఏఎస్పీ(అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) నారాయణ్ వెంకప్ప భరమణి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు మూడు పేజీలతో కూడిన లేఖను రాశారు. తనకు జరిగిన అవమానం గురించి అందులో తెలియజేశారు.

నిండు సభలో తనకు అవమానం జరిగిందని ఆయన వాపోయారు. ఆ ఘటన తనను మానసికంగా కుంగదీసిందన్నారు. తన కుటుంబం ఎంతగానో బాధపడిందన్నారు. 31 ఏళ్లు పోలీస్‌ శాఖలో అంకిత భావంతో పని చేసిన తనకు ఇలాంటి అవమానం జరగడం తట్టుకోలేపోతున్నాని, అందుకే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్లు నారాయణ్ భరమణి వెల్లడించారు.

ఏప్రిల్‌ 28న బెలగావిలో కాంగ్రెస్‌ సంవిధాన్‌ బచావ్ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతుండగా.. పలువురు ఆయన ప్రసంగానికి పదే పదే అడ్డు తగిలారు. గో టూ పాకిస్తాన్‌ అంటూ నినదించారు. దీంతో సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. ఆగ్రహంతో ఊగిపోయారు. వేదిక ముందున్న ఏఎస్పీ నారాయణ్‌ భరమణిని స్టేజ్ పైకి పిలిచారు. వాళ్లను ఎందుకు కంట్రోల్‌ చేయడం లేదని ప్రశ్నించారు. ఏఎస్పీ వివరణ ఇస్తున్నా వినిపించుకోలేదు. కొడతానంటూ అందరి ముందు చెయ్యెత్తారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ప్రతిపక్షాలు సీఎం సిద్ధరామయ్యను టార్గెట్ చేశాయి. ముఖ్యమంత్రి తీరును తప్పుబట్టాయి. కర్ణాటక కాంగ్రెస్ పాలనను హిట్లర్‌ పరిపాలనతో పోల్చాయి.

Also Read: మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా దారుణం.. పెళ్లైన 45 రోజులకే.. భర్తను చంపించిన భార్య..

ఈ ఘటనతో ఏఎస్పీ నారాయణ్ తీవ్ర మనస్తాపం చెందారు. వీఆర్ఎస్ తీసుకునేందుకు సిద్ధమైన ఆయన కర్ణాటక పోలీస్‌ శాఖకు లేఖ రాశారు. అందరూ చూస్తుండగానే నిండు బహిరంగం సభలో సీఎం సిద్ధరామయ్య చేతిలో నాకు అవమానం జరిగిందని వీఆర్ఎస్ లేఖలో ఆయన వాపోయారు. ఆ సంఘటన తను మానసికంగా దెబ్బతీసిందన్నారు. పలువురు తనను అవమానిస్తూ కామెంట్లు పెట్టారని వాపోయారు. పోలీస్‌ శాఖలో అంకిత భావంతో పనిచేసిన తనకు ఇలాంటి అవమానం జరగడాన్ని తట్టుకోలేకపోయానని లేఖలో పేర్కొన్నారు. కాగా, బెళగావి డీసీపీగా ఏఎస్పీ నారాయణ్‌ భరమణికి ప్రభుత్వం ఆఫర్ చేసిందని, అయితే ప్రభుత్వం ఆఫర్‌ను భరమణి తిరస్కరించారని సమాచారం.

”ముఖ్యమంత్రికి కోపం వచ్చి నన్ను చెంపదెబ్బ కొట్టడానికి ప్రయత్నించారు. నేను వెంటనే వెనక్కి వెళ్లాను. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. నేను ఏ తప్పు చేయలేదు, అయినప్పటికీ ఒక నిండు సభలో నన్ను అవమానించారు. ” అని ASP నారాయణ్ వెంకప్ప బరమణి స్వచ్ఛంద పదవీ విరమణ కోరే తన నిర్ణయాన్ని వివరిస్తూ ఒక బహిరంగ లేఖ రాశారు.