నాడు చున్నీ లాగారు, నేడు చెంప పగలగొట్టారు : మరో వివాదంలో మాజీ సీఎం

నాడు చున్నీ లాగారు, నేడు చెంప పగలగొట్టారు.. కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఆయన పార్టీ కార్యకర్త చెంప చెల్లుమనిపించారు. మైసూర్ ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది. మైసూర్ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో వెంట ఉన్న పార్టీ కార్యకర్త ఒకరు సిద్ధరామయ్యకి ఫోన్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అంతే సిద్ధూ సహనం కోల్పోయారు. కోపంతో ఊగిపోయారు. వెంటనే ఆ కార్యకర్త చెంప చెల్లుమనిపించారు. ఇదంతా పబ్లిక్ ప్లేస్ లో మీడియా ముందే జరిగింది. దీన్ని అక్కడున్న వారు వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. సిద్ధరామయ్య తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
సిద్ధరామయ్య ఇలా సహనం కోల్పోవడం తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి పనులు చేసి వార్తల్లోకి ఎక్కారు. 2019 జనవరిలో మైసూర్‌లో బహిరంగ సభలో పార్టీ నేతను ఒక్కతోపు తోశారు. 2016లో బళ్లారిలోని వాల్మీకి భవన్‌లో బ్యూరోక్రాట్‌ను చెంపదెబ్బ కొట్టడం దుమారం రేపింది. 2019 జనవరిలో వర్ణలో పర్యటించిన ఆయన.. ప్రజల సమస్యలు వింటున్నారు. తన సమస్య చెప్పుకోవడానికి వచ్చిన ఓ మహిళతో సిద్ధరామయ్య అనుచితంగా ప్రవర్తించారు. ఆమె చున్నీ లాగేశారు. అప్పుట్లో ఇది పెద్ద దుమారం రేపింది. నాడు చున్నీ లాగి వార్తల్లోకి ఎక్కిన సిద్ధరామయ్య… ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్త చెప్పు చెల్లుమనిపించి విమర్శల పాలయ్యారు. మరీ అంత కోపం పనికిరాదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కొంత సహనంగా ఉండటం అలవాటు చేసుకోవాలని హితవు పలుకుతున్నారు.