కర్నాటక మాజీ సీఎం బంధువు మర్డర్ మిస్టరీ, సూత్రధారి పిన్ని ?

కర్నాటక మాజీ సీఎం బంధువు మర్డర్ మిస్టరీ, సూత్రధారి పిన్ని ?

Updated On : February 3, 2021 / 7:38 AM IST

siddhartha devender singh : కర్నాటక మాజీ సీఎం బంధువు సిద్ధార్థ దేవేందర్‌సింగ్‌ హత్య కేసు దర్యాప్తు మరింత ముమ్మరమైంది. అయితే ఆస్తి కోసమే చంపారా? ఆర్థిక లావాదేవీల్లో తేడాలొచ్చి చంపారా అనే దానిపై ఇంతవరకు పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. ఈ కేసులో మృతుడు సిద్ధార్థ పిన్ని పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిద్ధార్థను అతని స్నేహితులు శ్యాంసుందర్‌రెడ్డి, వినోద్‌లే కడతేర్చారని దర్యాప్తులో తేలింది. మృతదేహాన్ని నెల్లూరు జిల్లా రాపూరు మండలం వెలుగోను సమీప అడవుల్లో పూడ్చిపెట్టిన నిందితులు ఆత్మహత్యాయత్నం చేశారు. శ్యాంసుందర్‌రెడ్డి చెట్టుకు ఉరేసుకుని చనిపోతే.. వినోద్‌ రైలు పక్కకు పడి తీవ్రగాయాలపాలయ్యాడు. వినోద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు…అతన్ని వెలుగోను అడవులకు తీసుకెళ్లి…మృతదేహాన్ని వెలికితీయించారు.

27 ఏళ్ల సిద్ధార్థ గత నెల 19న అదృశ్యమయ్యాడని అతని తల్లి పోలీసులకు ఫిర్యాదుచేసింది. చివరకు విగతజీవిగా కనిపించడంతో కొడుకు మృతదేహాన్ని చూడలేక బోరున విలపించారు తండ్రి దేవేందర్‌సింగ్‌. సిద్ధార్థ మృతదేహంపై ఎక్కడా గాయాలు లేవు. గొంతుకు మచ్చ ఉంది. దీంతో బలమైన తాడుతో లాగడంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఆస్తి కోసమే సిద్ధార్థను పిన్ని హత్య చేయించినట్లు అనుమానాలున్నాయి. సిద్ధార్థ తండ్రికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కర్నాటకలో, రెండో భార్య చెన్నైలో నివసిస్తున్నారు. మొదటి భార్య కుమారుడైన సిద్ధార్థ….కోట్ల ఆస్తులకు వారసుడు కావడంతోనే… అతని ఆస్తులపై కన్నేశారని కొంతమంది భావిస్తున్నారు.

తిరుపతికి చెందిన శ్యాంసుందర్‌రెడ్డితో సిద్ధార్థ పిన్నికి వివాహేతర సంబంధం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు శ్యాం సుందర్‌కు సిద్ధార్థతోనూ స్నేహం ఉంది. గత నెల 19న మరో స్నేహితుడు వినోద్‌కుమార్‌తో కలిసి సిద్ధార్థను కలిశాడు శ్యాంసుందర్‌. బెంగళూరు నుంచి అక్కడ్నుంచి కారులో చెన్నైకని బయలుదేరారు. సీటు బెల్టును గొంతుకు బిగించి సిద్ధార్థను చంపేశారు. తర్వాత మృతదేహాన్ని నెల్లూరు జిల్లా రాపూరు అటవీప్రాంతానికి తీసుకొచ్చి పూడ్చేశారు.