సోషల్ మీడియాకు ఇక సెలవ్: మోడీ అకౌంట్లు మహిళలకు అంకితం

ప్రధాని మోడీ చెప్పినట్లుగానే తన సోషల్ మీడియా అకౌంట్లను మహిళలకు అంకితం చేశారు. తన సోషల్ మీడియా ఖాతాలను ఏడుగురు మహిళలకు అప్పగించారు. ముందుగానే చెప్పిన విధంగా మహిళలకు ఆదివారం(08 మార్చి 2020) ఈ ఖాతాలను హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ మేరకు మోడీ ట్వీట్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీలకు శుభాకాంక్షలు తెలుపుతూ తాను సోషల్ మీడియా ఖాతాల నుంచి వైదొలగుతున్నట్లు వెల్లడించారు.
ఏడు మంది స్ఫూర్తివంతమైన మహిళలు ఇకపై తన సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తారని, వారు తమ జీవిత విశేషాలను నెటిజన్లతో పంచుకుంటారని మోడీ తెలిపారు. అనేక రంగాల్లో ఆ ఏడుగురు మహిళలు కృషి చేశారని, వారి జీవితాలు అనేక మందికి ప్రేరణగా నిలుస్తాయని, వారి విజయాల్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలని ఆకాంక్షించారు. వారి నుంచి మనం నేర్చుకోవాలని మోడీ పిలుపునిచ్చారు.
ఆ ఏడుగురు మహిళల్లో ఒకరైన స్నేహా మోహన్‌దాస్ తాను చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ఓ వీడియో ద్వారా వివరిస్తూ ట్వీట్ చేశారు. ఫుడ్ బ్యాంక్ ఇండియా పేరిట పేదల ఆకలి తీర్చుతున్నట్లు ఆమె వివరించారు.