శత్రువుపై నాగాస్త్రం.. భారత ఆర్మీ అమ్ములపొదిలో సరికొత్త ఆయుధం

ఈ సమస్యను అధిగమించేందుకు మన ఆర్మీ కూడా డ్రోన్ ఆయుధాలను సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ మానవరహిత డ్రోన్లను సమకూర్చుకుంది.

Nagastra 1 : రక్షణ రంగంలో స్వాలంబన దిశగా కీలక ముందడుగు పడింది. తొలిసారి స్వదేశీయంగా రూపొందించిన ఆత్మహుతి డ్రోన్ నాగాస్త్రం-1 భారత ఆర్మీ అమ్ములపొదిలో చేరింది. నాగ్ పూర్ లోని సోలార్ ఇండస్ట్రీకి చెందిన ఎకనామిక్స్ ఎక్స్ ప్లోజివ్ లిమిటెడ్ ఈఈఎల్(EEL) ఈ మానవరహిత విమానం యూఏవీ డ్రోన్లను తయారు చేసింది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లోని క్లిష్టమైన ప్రాంతాల్లో వాడేందుకు వీలుగా ఈ డ్రోన్లకు ఆర్డర్ ఇచ్చింది ఆర్మీ. మొత్తం 480 యూఏవీలకు ఆర్డర్ ఇవ్వగా, తొలి విడతలో 120 డ్రోన్లు సరఫరా చేశారు.

కశ్మీర్ లోని పుల్గావ్ ఆయుధ డిపోకు ఈ డ్రోన్లను తరలించారు. 9 కేజీల బరువుండే ఈ పోర్టబుల్ డ్రోన్.. గాలిలో ఏకధాటిగా 30 నిమిషాలు ఎగరగలదు. 30 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని చేధించగలదు. ఒక కిలో బరువు పేలుడు పదార్ధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఈ డ్రోన్ సొంతం. జీపీఎస్ ఆధారంగా పని చేసే ఈ డ్రోన్.. లక్ష్యాలపై కచ్చితత్వంతో దాడి చేస్తుంది. ఎలక్ట్రిక్ ప్రపల్షన్ సిస్టమ్ కారణంగా నాగాస్త్రం-1 తక్కువ శబ్దంతో ప్రయాణిస్తుంది. ఇది 200 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఎగిరితే శత్రువుకు దీన్ని గుర్తించడం కూడా కష్టమే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం ఎక్కువైంది.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో పాటు అజర్ బైజాన్, అర్మీనియా వివాదం, సిరియా సంఘర్షణలు, సౌదీలోని చమురు నిక్షేపాలపై దాడులకు డ్రోన్లనే ఎక్కువగా వాడుతున్నారు. మన దేశ ఉత్తర సరిహద్దుల్లోనూ తరుచూ డ్రోన్లు ఎగురుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు మన ఆర్మీ కూడా డ్రోన్ ఆయుధాలను సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ మానవరహిత డ్రోన్లను సమకూర్చుకుంది. వీటి ద్వారా పాక్, చైనా సరిహద్దుల్లో శత్రు మూకల కదలికలను అరికట్టవచ్చని చెబుతున్నారు.

Also Read : ఎమర్జెన్సీలో ఆపద్బాంధవుల్లా ఆదుకుంటారు.. జొమాటో డెలివరీ బాయ్స్‌కి సీపీఆర్, ప్రథమ చికిత్సలో శిక్షణ.. రికార్డు బద్దలు

ట్రెండింగ్ వార్తలు