Sisodia Arrested
Sisodia Arrested: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం విధితమే. ఆదివారం సీబీఐ హెడ్ క్వార్టర్స్‌లో సుమారు ఎనిమిది గంటలకుపైగా విచారణ జరిపిన అనంతరం ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. సిసోడియా అరెస్టు నేపథ్యంలో సీబీఐ కార్యాయలం వద్ద 144 సెక్షన్ విధించారు. అయితే, లిక్కర్ స్కాం కేసులో మనీశ్ సిసోడియా నేరపూరిత కుట్ర పన్నారని, సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడని సీబీఐ ఆరోపించింది. ఇదిలాఉంటే మధ్యాహ్నం 2గంటలకు సిసోడియాను సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపర్చే అవకాశం ఉంది. సిసోడియా అరెస్టుకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అంతేకాక ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళనలకు సైతం ఆప్ పిలుపునిచ్చింది. దీంతో ఢిల్లీలోని పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.
సిసోడియా అరెస్టుకు నిరసనగా ఆప్ నిరసనలు చేపట్టనున్న నేపథ్యంలో ఆప్ కార్యాలయం వద్ద సీఆర్‌పీఎఫ్ బలగాలు మోహరించారు. ఇదిలాఉంటే.. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎక్సైజ్ పాలసీలో మనీలాండరింగ్ కేసును ఆగస్టు 22న ఈడీ నమోదు చేసింది. ఇప్పటి వరకు ఆప్ కమ్యూనికేషన్ ఇంచార్జి విజయ్ నాయర్ సహా తొమ్మిది మందిని దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఈ స్కాంలో దాదాపు 36 మంది ప్రమేయం ఉన్నట్లు ఈడీ పేర్కొంది. అయితే, దాదాపు ఆర్నెళ్ల విచారణ తరువాత మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది.
ఆగస్టు 17న ఢిల్లీ మాజీ సీఎం సిసోడియాపై కేసు నమోదైంది. ఆగస్టు 9న మనీశ్ సిసోడియాతో పాటు మరో ముగ్గురు ఆప్ సభ్యుల నివాసాలపై సీబీఐ దాడులు నిర్వహించిన విషయం విధితమే. ఆగస్టు 30న ఐదుగురు సీబీఐ అధికారుల బృందం పీఎన్‌బీ బ్యాంకులో సిసోడియా బ్యాంక్ లాకర్లను సోదా చేశారు. అక్టోబర్ 17న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సిసోడియాను సీబీఐ సుమారు పది గంటల పాటు ప్రశ్నించింది. ఆ తరువాత నవంబర్ 25న, సిసోడియాను నిందితుడని పేర్కొంటూ సీబీఐ తన మొదటి చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ నెల 19న దర్యాప్తులో పాల్గొనాలని సిసోడియాకు సీబీఐ నోటీసులు ఇచ్చింది.
అయితే, నేను బీజీగా ఉండటం కారణంగా వారం రోజులు సమయం కావాలని సిసోడియా అడిగారు. ఆయన అభ్యర్థన మేరకు సీబీఐ ఆదివారం మరోసారి విచారణకు పిలిచింది. ఆదివారం సుమారు తొమ్మిది గంటల విచారణ అనంతరం ఆయన్ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. సిసోడియా అరెస్టుతో ఆప్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిసోడియాను మధ్యాహ్నం 2గంటల సమయంలో సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరుపర్చాల్సి ఉంది. అయితే, ఢిల్లీ వ్యాప్తంగా ఆప్ నిరసనలు తీవ్రతరం అయ్యే అవకాశం ఉండటంతో సీబీఐ అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది. ఆప్ శ్రేణుల నిరసనలు తీవ్రతరం అయితే.. వర్చువల్‌గా కోర్టు ఎదుట హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.