ఘోర ప్రమాదం.. ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలి ఆరుగురు చిన్నారులు మృతి..

ప్రభుత్వ పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు అక్కడికక్కడే మరణించగా.. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

Government school building collapses in Rajasthan

School Roof Collaps in Rajasthan: ప్రభుత్వ పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. మరో 30మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటన స్థలిలో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని ఝాలవర్‌ జిల్లా మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు అక్కడికక్కడే మరణించగా.. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదం సమయంలో శిథిలాల కింద చిన్నారులు చిక్కుకున్నారు. జేసీబీ సహాయంతో శిథిలాలను తొలగించి చిన్నారులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మనోహర్తన ఆసుపత్రి వైద్య అధికారి డాక్టర్ కౌశల్ లోధా మాట్లాడుతూ.. గాయపడిన 35 మంది పిల్లలను మా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వారిలో పదకొండు మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం ఝలావర్ లోని జిల్లా ఆస్పత్రికి తరలించామని చెప్పారు.


భవనం కూలిపోయిన సమయంలో దాదాపు 50 మంది పిల్లలు ఉన్నారు. ఇదిలాఉంటే.. పాఠశాల భవనం శిథిలావస్థలో ఉందని, దీనిపై గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ స్పందించారు. ఈ విషాద ఘటన తనను ఎంతో బాధించింది. గాయపడిన చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి చికిత్సకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. భవనం పైకప్పు ఎలా కూలిపోయిందనే విషయంను తెలుసుకునేందుకు విచారణ జరిపిస్తామని చెప్పారు.


ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. రాజస్థాన్‌ రాష్ట్రం ఝలావర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన ప్రమాదం విషాదకరం. తీవ్ర బాధాకరం. ఈ కష్ట సమయంలో బాధిత విద్యార్థులు, వారి కుటుంబాలతో నా ఆలోచనలు ఉన్నాయి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అధికారులు బాధితులు, వారి కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నారన్ని మోదీ పేర్కొన్నారు.