Sonia Gandhi Hospitalised: సోనియా గాంధీకి అస్వస్థత.. వెంటనే ఆసుపత్రికి తరలింపు.. డాక్టర్లు ఏం చెప్పారంటే..

సోనియాకు డాక్టర్ల బృందం ప్రత్యేక వైద్య పరీక్షలు చేసింది. ఆమెకు చికిత్స అందిస్తోంది.

Sonia Gandhi Hospitalised: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ(78) అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సోనియాకు చికిత్స అందించారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్నారు సోనియా గాంధీ. అక్కడ అనారోగ్యానికి గురయ్యారు. సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో సోనియాకు చికిత్స అందించారు. సోనియాకు డాక్టర్ల బృందం పలు ప్రత్యేక వైద్య పరీక్షలు చేసింది. సోనియా గాంధీకి రక్తపోటు కాస్త ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. అయిప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల బృందం చెప్పింది.

వ్యక్తిగత పర్యటనపై తన కూతురు ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి హిమాచల్ ప్రదేశ్ వెళ్లిన సోనియా.. సిమ్లాలోని మషోబ్రాలో ప్రైవేట్ నివాసంలో ఉంటున్నారు. సడెన్ గా సోనియా ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను ఐజీఎంసీకి తీసుకెళ్లారు. ప్రత్యేక వార్డులో ట్రీట్ మెంట్ ఇచ్చారు. సోనియా గాంధీకి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉండటంతో సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకొచ్చామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హిమాచల్ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు (మీడియా) నరేశ్ చౌహాన్ తెలిపారు. దాదాపు అరగంట పాటు ఆసుపత్రిలో ఉన్నారు సోనియా గాంధీ. ఆ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Also Read: భూమి అంతం కాబోతుందని హెచ్చరించిన ఎలాన్ మస్క్.. ఆ గ్రహమే మానవాళి జీవనానికి సురక్షితమట..

”ఆమెను సాధారణ తనిఖీ కోసం ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమె రక్తపోటు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఆమె పూర్తిగా క్షేమంగా ఉన్నారు. పరీక్షల తర్వాత సోనియాను డిశ్చార్జ్ చేశారు” అని ఐజీఎంసీ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అమన్ చౌహాన్ తెలిపారు. జూన్ 2న షిమ్లా చేరుకున్నారు సోనియా గాంధీ. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆమె తిరిగి ఢిల్లీ చేరుకోనున్నారు. సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారని తెలియగానే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కంగారుపడ్డారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు.