భూమి అంతం కాబోతుందని హెచ్చరించిన ఎలాన్ మస్క్.. ఆ గ్రహమే మానవాళి జీవనానికి సురక్షితమట..
టెక్ దిగ్గజం, బిలియనీర్ ఎలోన్ మస్క్ ప్రపంచానికి కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే కాలంలో భూమి అంతం కాబోతుందని..

Elon Musk: టెక్ దిగ్గజం, బిలియనీర్ ఎలోన్ మస్క్ ప్రపంచానికి కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే కాలంలో భూమి అంతం కాబోతుందని, ఇక్కడ ఎక్కువకాలం మానవాళి జీవనం సాగించలేదని చెప్పారు. మానవుల జీవనానికి సురక్షితమైన ప్రదేశం అంగారక గ్రహమేనని.. ఆ గ్రహంపై స్వయం నిరంతర నాగరికతను స్థాపించడం ద్వారా మాత్రమే మానవాళికి దీర్ఘకాలిక మనుగడ సాధ్యమవుతుందని చెప్పారు.
స్పేస్ ఎక్స్ ‘ఎక్స్’లో విడుదల చేసిన 42 నిమిషాల అంతర్గత చర్చలో ఎలాన్ మస్క్ మాట్లాడుతూ కీలక అంశాలను వెల్లడించారు. భూమి భవిష్యత్తు సురక్షితంగా లేదని హెచ్చరించారు. మూడవ ప్రపంచ యుద్ధం వంటి ముప్పు సంభవించినప్పుడు మానవాళికి సురక్షితమైన గ్రహంగా అంగారక గ్రహం ఉండాలని మస్క్ అన్నారు. 2026 చివరి నాటికి స్టార్‌షిప్ రాకెట్ అంగారక గ్రహానికి సిబ్బందిని పంపే అవకాశం 50శాతం ఉందని మస్క్ విశ్వసించారు.
మొదటి మిషన్ టెస్లా రూపొందించిన ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రాబోట్‌లను అంగారక ఉపరితలంపైకి తీసుకెళ్తుందని మస్క్ చెప్పారు. ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోట్ అంగారక గ్రహ ఉపరితలంపై తిరుగుతున్నట్లు చూడటం ఒక అద్భుత చిత్రం అవుతుందని మస్క్ చెప్పుకొచ్చారు. అయితే, మొదటి మిషన్ విజయవంతమై.. అవి విజయవంతంగా ఆ గ్రహంపై ల్యాండ్ అవుతాయని అంచనాకు వచ్చిన తరువాత మానవులను పంపుతామని, ఆ తరువాత ఆ గ్రహంపై మౌలిక సదుపాయాలను సమకూర్చడం ప్రారంభిస్తామని మస్క్ వివరించారు.
ఫాక్స్ న్యూస్ హోస్ట్ జెస్సీ వాటర్స్ తో ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో అంగారక గ్రహంపై దీర్ఘకాలిక ప్రణాళికలను మస్క్ వెల్లడించారు. భూమిపై ఉన్న అన్ని జీవులు సూర్యుడి వల్ల నాశనం అవుతాయి. సూర్యుడు క్రమంగా విస్తరిస్తున్నాడు. కాబట్టి మనం ఏదో ఒక సమయంలో వేరే గ్రహాన్ని ఆశ్రయించాలని మస్క్ చెప్పారు.
భూమి మరో 450 మిలియన్ సంవత్సరాలు పాటు నివాసయోగ్యంగా ఉంటుందని మస్క్ అంచనా వేశారు. అయితే, అణు యుద్ధం, ఏఐ, ఇతర మహమ్మారిల వల్ల సమీప భవిష్యత్తులో భూమి అంతరించిపోయే ప్రమాదం ఉందని మస్క్ చెప్పుకొచ్చారు.
మస్క్ ప్రణాళిక ప్రకారం.. 2030 నాటికి స్పేస్‌ఎక్స్ అంగారక గ్రహంపైకి 100 స్టార్‌షిప్‌లను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2033 నాటికి ఆ సంఖ్య 500కి పెరగవచ్చునని, భూమి నుంచి ఎటువంటి సహాయం లేకుండా జీవించగల సామర్థ్యం ఉన్న ఒక మిలియన్ కంటే ఎక్కువ మందితో స్వయం సమృద్ధిగల సామర్థ్యాన్ని అంగారక గ్రహంపై నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.