కటకటాల్లో ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్.. సీఎంగా ప్రమాణ స్వీకారం కోసం చంపై ప్రయత్నాలు

 Hemant Soren: ఈడీ విచారణ నేపథ్యంలో సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఝార్ఖండ్ కొత్త సీఎంగా జేఎంఎం సీనియర్‌ నేత, మంత్రి చంపై సోరెన్‌‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

 Hemant Soren

ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌‌ను రాంచీలోని ప్రత్యేక కోర్టు ఒకరోజుపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. నగదు అక్రమ చలామణి కేసులో సోరెన్‌ను పదిరోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. రేపు దీనిపై కోర్టు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

హేమంత్‌ సోరెన్‌‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే. కోర్టు ఒకరోజుపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించడంతో ఆయనను రాంచీ హోత్వార్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈడీ విచారణ నేపథ్యంలో సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఝార్ఖండ్ కొత్త సీఎంగా జేఎంఎం సీనియర్‌ నేత, మంత్రి చంపై సోరెన్‌‌ను ఎంపిక చేశారు.

చంపై సోరెన్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన ఇవాళ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. మరోవైపు, హైదరాబాద్‌కు ఝార్ఖండ్ ఇండియా కూటమి ఎమ్మేల్యేలు రానున్నట్లు తెలుస్తోంది. రాంచీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్నారు. 35 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వస్తారని తెలుస్తోంది. బేగంపేట నుంచి గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ కు వారు వెళ్లనున్నారు.

 Also Read: జాగ్రత్తగా ఉండండి.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ హెచ్చరిక