విద్వేష వ్యాఖ్యలే ఢిల్లీలో పార్టీ కొంప ముంచాయి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమితో హోంమంత్రి తెగ ఫీల్ అయిపోతున్నారంట. బీజేపీ నాయకులు ప్రచార సమయంలో విద్వేష ప్రసంగాలు చేసి ఉండాల్సి కాదంటూ చేతులు కాలిన తర్వాత..ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు రియలైజ్ అయ్యారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మొదటిసారిగా అమిత్ షా పార్టీ ఓటమిపై స్పందించారు.

గురువారం(ఫిబ్రవరి-13,2020) టైమ్స్ నౌ సమ్మిట్ 2020లో పాల్గొన్న అమిత్ షా మట్లాడుతూ…ఢిల్లీలో బీజేపీ ఓటమికి విద్వేష ప్రసంగాలే కారణం అయి ఉండవచ్చన్నారు. మీ భార్య,పిల్లలను రేప్ చేస్తారు అనే పదాన్ని తమ నాయకులు వాడలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పిన షా…గోలీ మారో,ఇండో-పాక్ మ్యాచ్ అంటూ వ్యాఖ్యలు చేశారన్నారు. అలాంటి ప్రసంగాలు చేసి ఉండాల్సింది కాదన్నారు. అన్ని రకాల కార్యకర్తలు ఏదో చెప్పవచ్చు కానీ ప్రజలకు బీజేపీ పార్టీ ఎలాంటిదో తెలుసునని షా అన్నారు.

బీజేపీ నాయకులు మొన్న ఎన్నికల సమయంలో కొన్ని ద్వేష ప్రసంగాలే పార్టీ ఓటమికి ముఖ్య కారణం అయి ఉండవచ్చన్నారు. బీజేపీకి ఓటు ఎందుకు వేయలేదో తమకు కరెక్ట్ గా తెలియదని,కానీ ఇదే కారణం అయి ఉండవచ్చన్నారు. బీజేపీ గెలిచే సీట్ల సంఖ్య విషయంలో తన అంచనా తప్పిందని సా అన్నారు. బీజేపీకి మెజార్టీ సీట్లు వస్తాయని తాను బలంగా నమ్మానని అన్నారు. చాలా సార్లు తన అంచనాలు నిజమయ్యాయని,ఈ సారి మాత్రం తన అంచనా తప్పిందని షా అన్నారు. 

ఫిబ్రవరి-11,2020న విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 70స్థానాల్లో ఆప్ 62సీట్లు గెల్చుకున్న విషయం తెలిసిందే. బీజేపీ కేవలం 8స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు.