Stray dogs
Stray Dogs : ఢిల్లీ, ఎన్సీఆర్‌లో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆగస్టు 11న ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం తన తీర్పును వెలువరించింది. వీధి కుక్కల (Stray Dogs) కు వ్యాక్సినేషన్ చేసి వదిలేయాలని ఆదేశించింది. కేవలం రేబిస్ ఉన్న వీధి కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలని ఉత్తర్వులు ఇచ్చింది. వీధి కుక్కలకు వీధుల్లో ఆహారం ఇవ్వొద్దని సుప్రీంకోర్టు సూచించింది. కేవలం కొన్ని ప్రాంతాలను ఏర్పాటు చేసి వాటికి ఆహారం అందించాలని సూచించింది.
Also Read: Aadhaar for Stray Dogs : వీధి కుక్కలకు ఆధార్ కార్డులు .. వాటి మెడలోనే క్యూఆర్ కోడ్ కార్డు
ఢిల్లీ, ఎన్సీఆర్‌లోని వీధి కుక్కలన్నింటిని షెల్టర్లకు తరలించాలని ఆగస్టు 11న సుప్రీంకోర్టు అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. సుప్రీం ఉత్తర్వులపై ఢిల్లీ -ఎన్సీఆర్‌లో నిరసనలు వ్యక్తమయ్యాయి. జంతు ప్రేమికులు సుప్రీం ఉత్తర్వుల పట్ల తమ నిరసనను తెలిపారు. దీనికితోడు.. ఆగస్టు 11న ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి.అంజరియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. తీర్పును రిజర్వు చేసింది. తాజాగా.. ఇవాళ (ఆగస్టు 22) తుది తీర్పును వెలువరించింది.
రేబిస్ సోకిన, దూకుడుగా ప్రవర్తన ఉన్న కుక్కలను వదిలిపెట్టొద్దు.. వాటిని షెల్టర్లకు తరలించాలి. మిగిలిన వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ వేసి వదిలివేయాలి. కుక్కలకు వీధుల్లో ఆహారం పెట్టొద్దు. వాటికి ఆహారం పెట్టేందుకు ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ సూచనలు పాటించాలి. భారతదేశం అంతటా ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని, స్థానిక అధికారులు వీటిని అమలు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
వీధి కుక్కలను పట్టే పనిని అడ్డుకునే వారికి రూ.25వేల నుంచి రూ.2లక్షల వరకు జరిమానా విధిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. జంతు ప్రేమికులు వీధి కుక్కలను దత్తత తీసుకోవడానికి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ను సంప్రదించవచ్చునని పేర్కొంది. నిర్దేశిత దాణా ప్రాంతాల దగ్టర నోటీసు బోర్డులు ఉంచాలని, అటువంటి ప్రాంతాల్లో వీధి కుక్కలకు మాత్రమే ఆహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.