సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర పెంపు…ఒక్కో సిలిండర్ పై రూ.50

  • Published By: bheemraj ,Published On : December 2, 2020 / 11:56 AM IST
సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర పెంపు…ఒక్కో సిలిండర్ పై రూ.50

Updated On : December 2, 2020 / 2:20 PM IST

Subsidized gas cylinder price hike : సామాన్యులకు భారీ షాక్‌ ఇచ్చింది కేంద్రం. గ్యాస్‌ సిలిండర్‌ ధరను ఒక్కసారిగా పెంచేసింది. ఒక్కో సబ్సిడీ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి రానున్నాయి. సబ్సిడీయేతర సిలిండర్ ధరలను అప్పుడప్పుడూ పెంచుతూ వచ్చిన కేంద్రం.. సామాన్యులు వినియోగించే సబ్సిడీ సిలిండర్ల ధరలను మాత్రం పెంచలేదు.



అయితే ఇప్పుడు ఒక్కో సబ్సిడీ సిలిండర్‌ పైన 50 రూపాయలు పెంచడంతో సామాన్యులపై భారం పడనుంది. అయితే పెంచిన ధరను సబ్సిడీ రూపంలో కేంద్రం భరిస్తుందా.. లేకుంటే వినియోగదారులపైనే భారం మోపుతుందా.. అనేది తెలియాల్సి ఉంది….



హైదరాబాద్‌లో ప్రస్తుతం 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్ ధర 636 రూపాయల 50 పైసలు ఉంది. ఇప్పుడు 50 రూపాయలు పెరగడంతో సిలిండర్ ధర 686 రూపాయల 50 పైసలకు చేరుకోనుంది. అలాగే… ఢిల్లీలో సబ్సిడీ సిలిండర్ ధర 594 రూపాయలుగా ఉంది.



ముంబైలో 590 రూపాయల 50 పైసలు, కోల్‌కతలో 616 రూపాయలు, చెన్నైలో 606 రూపాయల 50పైసలు వసూలు చేస్తున్నారు. తాజాగా 50 రూపాయలు పెరగడంతో ఆ మేరకు దేశవ్యాప్తంగా ధరలు ఎగబాకనున్నాయి. ఆయా ప్రాంతాలను బట్టి ట్రాన్స్‌పోర్ట్‌ ఛార్జీలు అదనంగా వసూలు చేస్తారు..



గడిచిన ఆరు నెలలుగా చమురు ధరలు ఆందోళనకరంగా పెరుగుతుండటం, ఆ తర్వాత దీని ఎఫెక్ట్ గ్యాస్ పై కూడా పడింది. ప్రస్తుతం సబ్సిడీ గ్యాస్ ధరను పెంచడంతో పేద ప్రజలు, సామాన్యులు ఎవరైతే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారో వారు అదనంగా డబ్బును వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చింది.



అయితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తక్కువ మొత్తంలోనే పెరుగుతున్నప్పటికీ రోజు రోజుకీ గ్యాస్ సిలిండర్లు, చమురు ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలోనే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచామని చమురు సంస్థలు వెల్లడించాయి.