దేశంలో నానాటికీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు నేపధ్యంలో సామాన్యుడికి చౌకైన కరోనా మందును అందిస్తోంది సన్ ఫార్మా. ఫావిపివరవిర్ డ్రగ్ ఫ్లూగార్డ్ (200 మి.గ్రా)ను మార్కెట్ లో విడుదల చేసినట్లు సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఔషధం ఒక్కో టాబ్లెట్ ధరను కేవలం 35 రూపాయలుగా నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరకు లభించే ఔషధం ఇదే. అతి తక్కువ ధరలో ఎక్కువమంది బాధితులకు తమ మందును అందుబాటులోకి తీసుకొచ్చేలా ఫ్లూగార్డ్‌ను తయారు చేసినట్లు సన్ ఫార్మా ఇండియా బిజినెస్ సీఈఓ కీర్తి గానోర్కర్ తెలిపారు. తద్వారా వారి ఆర్థిక భారాన్ని తగ్గించాలనేది లక్ష్యమని చెప్పారు.
దేశవ్యాప్తంగా రోగులకు ఫ్లూగార్డ్ ట్యాబ్లెట్లను అందించేందుకు తమ సంస్థ కేంద్రం, ఇతర ఫార్మా కంపెనీలతో కలిసి పనిచేస్తున్నట్లు కీర్తి గానోర్కర్ వెల్లడించారు ఈ వారంలో ఫ్లూ గార్డ్ మార్కెట్ లో అందుబాటులోకి రానుంది. ఫావిపిరవిర్‌ను మొదట జపాన్‌కు చెందిన ఫుజిఫిల్మ్ హోల్డింగ్స్ అవిగన్ బ్రాండ్ పేరుతో అభివృద్ధి చేసింది.
ఫావిపిరవిర్‌ను భారతదేశంలో అభివృద్ధి చేసి, విక్రయించే ఇతర కంపెనీల్లో గ్లెన్‌మార్క్ ఫార్మా, సిప్లా, హెటెరో ల్యాబ్‌లు ఉన్నాయి. అర డజనుకు పైగా ఫావిపిరవిర్ బ్రాండ్లు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. దీన్ని మొదట జపాన్ లో తయారు చేసిన అవిగాన్ ను ను డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఈ నెలలో ప్రారంభించనుంది.
ఇవికాక మరో రెండు కంపెనీలు కూడా త్వరలో ఫావిపిరవిర్ ను మార్కెట్ లోకి విడుదల చేయబోతున్నాయి. వీటిలో హైదరాబాద్‌కు చెందిన బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన జనేరా ఫార్మా, ముంబయికి చెందిన బీడీఆర్ ఫార్మా ఉన్నాయి. ‘బిడిఫావి’ అనే బ్రాండు పేరుతో ఫావిపిరవిర్ ఔషధాన్ని విడుదల చేసినట్లు, ఒక్కో ట్యాబ్లెట్‌కు రూ.63 ధర నిర్ణయించినట్లు బీడీఆర్ ఫార్మా తెలియజేసింది.
ఫావిపిరవిర్ ట్యాబ్లెట్ తయారీకి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) నుంచి తమ అనుబంధ కంపెనీ అయిన జనేరా ఫార్మాకు అనుమతి వచ్చినట్లు, దీన్ని ‘ఫావిజెన్’ అనే బ్రాండు పేరుతో దేశీయ విపణిలో విడుదల చేస్తామని బయోఫోర్ ఇండియా ఫార్మాసూటికల్స్ వివరించింది.
ఈ ట్యాబ్లెట్‌ను హైదరాబాద్ సమీపంలోని జనేరా ఫార్మాకు చెందిన యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి గల యూనిట్లో తయారు చేస్తామని పేర్కొంది. కాగా హైదరాబాద్ కు చెందిన వివిమెడ్ ల్యాబ్స్‌కు ఫావిపిరవిర్ ఔషధం ఎగుమతి ఆర్డర్ లభించింది. ‘ఫావులస్’ అనే బ్రాండుతో తాము తయారు చేసిన ఫావిపిరవిర్ 200 ఎంజీ ట్యాబ్లెట్‌ను ఎగుమతి చేయనున్నట్లు సంస్ధ వెల్లడించింది.