Sunny Leone : కరోనా కష్టకాలంలో సన్నీ లియోన్ గొప్పమనసు.. 10వేల మంది వలసకూలీల కడుపు నింపుతోంది

పని దొరక్క.. ఉండటానికి వసతి లేక వేలాది మంది వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి దొరక్క కడుపు కాల్చుకొని బతుకుతున్నారు. అలాంటి వారికి చేయూత అందించడానికి బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ ముందుకు వచ్చింది.

Sunny Leone : కరోనా మహమ్మారి ఎంతోమంది జీవితాలను చిద్రం చేసింది. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఇక ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. వలస కార్మికుల పరిస్థితి మరీ దయనీయం. పని దొరక్క.. ఉండటానికి వసతి లేక వేలాది మంది వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి దొరక్క కడుపు కాల్చుకొని బతుకుతున్నారు. అలాంటి వారికి చేయూత అందించడానికి బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ ముందుకు వచ్చింది. సన్నీలియోన్ తన గొప్ప మనసు చాటుకుంది. ఢిల్లీలోని పదివేల మంది వలస కూలీల కడుపు నింపేందుకు పెటా (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) ఇండియాతో చేతులు కలిపింది. ఉదయ్‌ ఫౌండేషన్‌ ద్వారా పూర్తిస్థాయిలో పౌష్టికాహాన్ని ఢిల్లీలోని వలస కార్మికులకు అందించనుంది. ఈ ఆహారంలో దాల్, రైస్, కిచిడీ, ఫ్రూట్స్ ఉంటాయి.

 

”ప్రస్తుతం మనమందరం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం​. ఇలాంటి సమయంలో దయ, కరుణతో అంతా ముందుకొచ్చి పేదలకు సాయం అందించాలి. పెటా ఇండియాతో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది. పేదవాళ్లు ఎదుర్కొంటున్న అతి ముఖ్య సమస్య ఇది. వేలాది మంది కార్మికులకు మంచి పౌషికాహారాన్ని అందించబోతున్నాం. ఈ సమయంలో వారికి ఇది ఎంతో అవసరం” అని సన్నీ తెలిపింది.

 

అందంతో పాటు గొప్ప మనస్సున్న నటిగా సన్నీలియోన్ గుర్తింపు పొందింది. ఆమె గతాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంతోమంది విమర్శలు చేసినా.. అవేవీ పట్టించుకోకుండా.. తన ప్రతిభతో బాలీవుడ్‌లో స్టార్ హోదా సంపాదించుకుంది. ఇక మానవత్వం విషయంలో సన్నీ ఎప్పుడూ ముందుంటుంది. గతంలో ఎన్నో సందర్భాల్లో ఆమె ఉదారతను చాటుకుంది. ఎన్నో ఛారిటీలకు విరాళాలు అందించడమే కాక.. సేవా కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. సన్నీతో పాటు ఆమె భర్త డేనియల్ కూడా సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటాడు.

 

వలస కార్మికుల ఆకలి తీరుస్తున్న సన్నీ ఉదారతను మరోసారి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రియల్‌ స్టార్‌ అంటూ పొడగ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం సన్నీలియోన్‌ మలయాళంలో ‘షెరో’, ‘రంగీలా’ అనే చిత్రాల్లో నటిస్తోంది. దీంతో పాటు తెలుగు, హిందీల్లో రూపొందుతున్న ‘హెలెన్’, ‘కోకాకోలా’ సినిమాలు చేస్తోంది. జిస్మ్‌-2 సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన సన్నీ.. అనతి కాలంలోనే స్టార్‌గా ఎదిగింది. హిందీతో పాటు తెలుగు, తమిళ ఇతర భాషల చిత్రల్లోనూ ఆమె నటించింది.

ట్రెండింగ్ వార్తలు