Two Finger Test : దశాబ్దాలు గడిచాయి. తరాలు మారాయి. టెక్నాలజీ కూడా ఎంతగానో అందుబాటులోకి వచ్చింది. అయినా ఈ దేశంలో రేప్ బాధితులను నిర్ధారించేందుకు ఇంకా టూ ఫింగర్ టెస్ట్ నే నమ్ముతున్నారు డాక్టర్లు. ఈ విధానం వల్ల బాధితుల సమస్య తీరకపోగా మరోసారి వారు బాధితులు అవుతున్నారు. ఇప్పుడీ విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దేశంలో టూ ఫింగర్ టెస్ట్ ని నిషేధించింది.
రేప్ నిర్ధారణకు చేసే టూ ఫింగర్ టెస్ట్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అత్యాచార బాధితులను గుర్తించేందుకు డాక్టర్లు ఇప్పటికీ టూ ఫింగర్ టెస్ట్ నే నిర్వహిస్తున్నారు. ఈ విధానం వల్ల అత్యాచార బాధితులు మరింత కుంగిపోతున్నారు. దీంతో వారికి ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
దేశంలో టూ ఫింగర్ టెస్ట్ నిషేధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ రోజుల్లోనూ ఇలాంటి పరీక్షలు చేయడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఇంకా పాత విధానంలోనే అత్యాచార బాధితులను పరీక్షించడం నుంచి సమాజం పూర్తిగా దూరమవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. మహిళల గౌరవానికి భంగం కలిగించే రెండు వేళ్ల పరీక్ష జరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది.
అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన ఓ నిందితుడిని జార్ఖండ్ హైకోర్టు నిర్దోషిగా విడిచిపెడుతూ తీసుకున్న నిర్ణయాన్ని డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. దోషిగా నిర్ధారించిన ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ఇదే క్రమంలో టూ ఫింగర్ టెస్ట్ పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచార నిర్ధారణకు డాక్టర్లు టూ ఫింగర్ టెస్ట్ నిర్వహించడం అత్యంత అమానవీయం అని, ఈ రకమైన టెస్ట్ బాధితుల గోప్యతా హక్కుకు తీవ్ర భంగకరం అని చెబుతూ 2013లోనే సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అత్యాచార బాధితులు వారి శారీరక, మానసిక సమగ్రత, గౌరవానికి భంగం కలిగించని చట్టపరమైన ఆశ్రయానికి అర్హులని తెలిపింది. క్రూరమైన అమానవీయమైన అవమానకరమైన వైద్య విధానాలు వారిపై నిర్వహించకూడదు.