దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా ఫైల్ చేసిన పిటిషన్ ను సోమవారం(జనవరి-20,2020)సుప్రీం కోర్టు కొట్టివేసింది. నిర్భయ ఘటన సమయంలో తాను మైనర్ అని పవన్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇప్పటికే పవన్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.
అయితే ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పవన్ గుప్తా లాయర్లు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఘటన సమయంలో పవన్ మైనర్ అని, అతని స్కూల్ సర్టిఫికెట్‌లో కూడా అతడు మైనర్ అని చెప్పడానికి ఆధారాలున్నాయని దోషి తరపు న్యాయవాది ఏపీ సింగ్ కోర్టుకు తెలిపారు. ఢిల్లీ హైకోర్టు ఈ విషయాన్ని పరిగణించలేదని ఏపీ సింగ్ సుప్రీం కోర్టుకు వెల్లడించారు.
అయితే నిర్భయ ఘటన జరినప్పుడు పవన్ కు 19ఏళ్లు అని అతని బర్త్ సర్టిఫికేట్ ద్వారా తెలిసిందని ఢిల్లీ పోలీసులు ఫైల్ చేసిన పిటిషన్ ను జస్టిన్ ఆర్ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం స్వీకరించి…ఇవాళ ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా దేశరాజధానిలో డిసెంబర్ 16,2010న జరిగిన అత్యంత దారుణంగా వైద్యవిద్యార్థిని నిర్భయపై గ్యాంగ్ రేప్,హత్యకు పాల్పడినప్పుడు పవన్ మైనర్ కాదని తెలిపింది. కాలయాపన కోసమే పిటిషన్ వేశారని కోర్టు తెలిపింది. ఒకే అంశంపై మళ్లీ మళ్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయరాదని, పిటిషన్ విచారణకు అర్హత లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పవన్ గుప్తా తరఫు న్యాయవాదిని కోర్టు మందలించింది.
నిర్భయ దోషులకు ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫిభ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలు పరచాల్సిందిగా డెత్ వారెంట్‌లో తెలిపింది. ఇక నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులను గురువారం(జనవరి-16,2020) ఉరిశిక్షలు జరిగే జైలు నెంబర్ 3కి షిఫ్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నలుగురు దోషులు పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ లను ఉరితీసే ఏర్పాట్లలో బిజీగా ఉన్న తీహార్ యంత్రాంగం మొదటిసారిగా వాళ్లని అదే జైలులో ఉరిశిక్షలు జరిగే జైలు నెంబర్ 3కి తరలించారు. ఈ నలుగురు దోషులను వేర్వేరు సెల్స్ లో ఉంచి, సిసిటివి ద్వారా పర్యవేక్షిస్తున్నారు. దేశచరిత్రలో తొలిసారిగా నలుగురు దోషులను ఒకేసారి ఉరితీస్తున్నారు. ఆసియాలో అతిపెద్ద జైలు అయిన తీహార్ జైలులో ఉరి పరీక్షించడానికి డమ్మీ ఉరిశిక్ష కూడా జరిగింది.
దేశ రాజధానిలో డిసెంబర్ 16, 2012లో నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని దోషులుగా గుర్తించగా..వారిలో ఒకడు… తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక వ్యక్తి మైనర్ కావడంతో… జువెనైల్ చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత రిలీజ్ అయ్యాడు. మిగతా నలుగురూ నిందితులు దోషులైన పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ లు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.