రాఫెల్ డీల్ లో మోడీ సర్కార్ కు బిగ్ రిలీఫ్..రాహుల్ ని నోరు జారవద్దన్న సుప్రీం

రాఫెల్ డీల్  విషయంలో మోడీ సర్కార్ కు ఊరట లభించింది. రాఫెల్‌ రివ్యూ పిటిషన్లను ఇవాళ(నవంబర్-14,2019) సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాఫెల్ డీల్ కు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 36 యుద్ధ విమానాల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించిన సుప్రీంకోర్టు 2018 డిసెంబర్ 14న సంబంధిత పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఆ తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాజీ కేంద్రమంత్రులు యశ్వంత్ సిన్హా,అరుణ్ శౌరీ,సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ తీర్పుని పున:పరిశీలించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. రాఫెల్ డీల్ లో ఎలాంటి అక్రమాలు జరగలేదని తేల్చిచెప్పింది ధర్మాసనం. పారదర్శకంగానే డీల్ జరిగిందంది. ఇందులో సీబీఐ విచారణ జరపాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం తెలిపింది. 36 రాఫెల్ యుద్ధ విమానాలలో మొదటిది డసాల్ట్ ఏవియేషన్ నుండి అక్టోబర్-8,2019అధికారికంగా భారత్ కు అందిన విషయం తెలిసిందే.

మరోవైపు రాఫెల్ విషయంలో ప్రధాని మోడీని ఉద్దేశించి చేసిన ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అన్న రాహుల్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయంటూ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి వేసిన పిటిషన్ పై ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. రాహుల్ పై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసును సుప్రీం కొట్టివేసింది. మరోసారి నోరు జారవద్దని రాహుల్ కి సూచించింది.