Supreme Court : జాతీయ రహదారిపై ప్రయాణికులు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొని అవస్థలు పడిన సందర్భాల్లో టోల్ రుసుము ఎందుకు చెల్లించాలని సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం భారతీయ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI)ని ప్రశ్నించింది. ట్రాఫిక్ లో గంటపాటు ఇరుక్కుపోయినా టోల్ ఫీజు కట్టాలంటూ వాహనదారులను ఒత్తిడి చేయడంపై అభ్యంతరం తెలిపింది.
Also Read: Six Planet Parade: అరుదైన ఖగోళ దృశ్యం..! 6 గ్రహాల పరేడ్.. ప్రత్యేకత ఏంటి, కంటికి కనిపిస్తుందా?
కేరళలోని త్రిస్సూర్ జాతీయ రహదారిపై 65 కిలోమీటర్ల ప్రయాణానికి 12గంటల సమయం తీసుకుంటున్నందున టోల్ ఫీజు రూ.150 ను మరమ్మతులు పూర్తయ్యేదాకా నాలుగు వారాల పాటు వసూలు చేయొద్దంటూ ఈ నెల 6న కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఎన్‌హెచ్ఏఐ, గురువాయూర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ఈ పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
రోడ్డు పనులు జరుగుతుండటంతో నెంబర్ 544 జాతీయ రహదారిలో ఎడపల్లి -మన్నుతి మధ్య వాహనాలు నిలిచిపోతున్నందున పలియెక్కర ప్లాజాలో టోల్ వసూలును ఆపాలంటూ కేరళ హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, రహదారిపై లారీ ఒకటి అడ్డంగా నిలిచిపోవడం వల్లే ట్రాఫిక్ సమస్య ఏర్పడిదంటూ ఎన్‌హెచ్ఏఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.
అయితే, అదేమీ దైవ నిర్ణయం కాదు కదా..? రోడ్డుపై భారీ గుంత పడినందునే లారీ నిలిచిపోయింది కదా అంటూ ధర్మాసనం అడ్డు తగిలింది. గురువాయూర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రోడ్డు పనుల బాధ్యతలను ఇతరులు తీసుకున్నందున, టోల్ ఆదాయాన్ని తాము కోల్పోవాలని అనడం అన్యాయంగా ఉందని సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కేవలం ఈ 10 రోజుల్లోనే తమకు ఐదారు కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు.
రోడ్డు ఒక చివరి నుంచి మరో చివరికి చేరుకునేందుకు 12 గంటల సమయం తీసుకున్నా రూ.150 ఎందుకు చెల్లించాలి..? సాధారణ ప్రయాణ సమయం గంట మాత్రమే కాగా.. అదనంగా 11 గంటలు పట్టింది.
అయినా టోల్ రుసుము కట్టాలంటూ వాహనదారులను ఒత్తిడి చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. ట్రాఫిక్ ఆగిపోవడం అదేమీ దైవ నిర్ణయం కాదు.. రోడ్డుపై భారీ గుంత పడినందునే లారీ నిలిచిపోయింది కదా అంటూ ధర్మాసనం పేర్కొంది.
మీకు కలిగిన నష్టాన్ని ఎన్ హెచ్ఏఐ నుంచి రాబట్టుకోవాలని గురువాయూర్ కంపెనీకి ధర్మాసనం స్పష్టం చేసింది. తీవ్రంగా ఉన్న ఈ సమస్యకు టోల్ రుసుము తగ్గింపుసైతం తగిన పరిష్కారం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై తీర్పున రిజర్వులో ఉంచుతున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.