సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం

  • Published By: naveen ,Published On : August 19, 2020 / 11:21 AM IST
సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం

Updated On : August 19, 2020 / 12:17 PM IST

సంచలనం రేపిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుశాంత్ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు బుధవారం(ఆగస్టు 19,2020) అత్యున్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని తెలిపింది. సేకరించిన ఆధారాలను, కేసు పత్రాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను కోర్టు ఆదేశించింది. అలాగే సీబీఐకి సహకరించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు అవసరం అనుకుంటే కొత్త కేసు నమోదు చేయాలని సీబీఐకి సూచించింది. సుశాంత్ సింగ్ మృతిపై కుటుంబసభ్యులు పలు అనునామాలు వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య అని ఆరోపిస్తున్నారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ఆసక్తికరంగా మారింది.



సినీ పరిశ్రమలోనే కాదు రాజకీయంగానూ ప్రకంపనలు:
అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసు బాలీవుడ్‌లోనే కాకుండా రాజకీయంగానూ ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం తెలపగా.. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సుశాంత్‌ మృతి కేసుపై సీబీఐ విచారణకు బిహార్‌ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కేంద్రం అంగీకరించింది. సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు బీహార్ సీఎం సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు.

అయితే, ఈ కేసులో తనపై పట్నాలో దాఖలైన కేసు విచారణను ముంబైకి బదిలీ చేయాలని కోరుతూ సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆగస్టు 11 నాటి విచారణ సందర్భంగా.. రియా తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ… నిజం కంటే రాజకీయ జోక్యం ఎక్కువగా మారిందని స్పష్టమవుతోందన్నారు. అసంబద్ధమైన వాదనలతో బీహార్‌లో ఎన్నికల సందర్భంగా రాజకీయంగా ఈ కేసును వాడుకుంటున్నారని రియా చక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు.



సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య:
సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడలేదని, హత్యకు గురయ్యారంటూ పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ఆరోపిస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న నెల రోజుల తర్వాత ఆయన తండ్రి కేకే సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె కుటుంబం తన కొడుకుని మోసం చేసిందని, ఆర్ధికంగా, మానసికంగా వేధించారని ఆయన ఆరోపించారు.

సాక్ష్యులకు భద్రత కల్పించాలి:
కేసుకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి ఒక్కక్కరూ బయటకు వస్తున్నారని, వారికి భద్రత కల్పించాలని సుశాంత్‌ సింగ్‌ బంధువు, బీజేపీ ఎమ్మెల్యే నీరజ్‌ కుమార్‌ సింగ్‌ బబ్లు కోరారు. ఈ కేసులో నిజాలు బయటపెట్టేందుకు చాలామంది సాక్ష్యులు ఉన్నారని, వారు ప్రాణ భయంతో బయటకు రావడం లేదన్నారు. ఇప్పటికే ముందుకొచ్చిన సాక్ష్యులకు భద్రత కల్పించాలని వేడుకున్నారు.



జూన్ 14న సుశాంత్ మృతి:
సుశాంత్ సింగ్ జూన్ 14న చనిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. ముంబైలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. కొన్ని నెలలుగా సుశాంత్‌ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త బాలీవుడ్‌ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ యువహీరో ఇక లేరనే చేదు వార్తను బాలీవుడ్‌ ఇండస్ట్రీ దింగమింగుకోలేకపోయింది. ఆ తర్వాత సుశాంత్ కేసు అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య అనే ఆరోపణాలు ఎక్కువయ్యాయి.