స్పీకర్లు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారా!!

అధికారాన్ని బట్టి, పదవులను బట్టి పార్టీలు మారుతూ ప్రజాతీర్పును నీరుగారుస్తున్న రాజకీయ నాయకుల నెత్తిన సుప్రీంకోర్టు సమ్మెట పోటు పొడిచింది. ఎన్నికల్లో గెలిచాక పార్టీలు మారే వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలయ్యే ఫిర్యాదులను సభాపతులు (లోక్ సభ, శాసనసభల స్పీకర్లు) వీలైనంత త్వరగా కీలక తీర్పు వెలువరించింది. 

అత్యంత అరుదైన సందర్భాలు కాకుండా మిగిలిన సమయాల్లో కాలపరిమితిలోగా నిర్ణయం తీసుకోవాలి. కేసును బట్టి కాలవ్యవధి మారినా మూడు నెలల్లోగా తేల్చేయాలి. చట్టాన్ని ధిక్కరిస్తూ, పార్టీలు మారిన వారిపై (ఫిరాయింపుల-నిరోధక చట్టం కింద) స్పీకర్లు నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో పేర్కొన్న రాజ్యాంగ లక్ష్యం నెరవేరినట్లు లెక్క’ అని జస్టిస్‌ రోహింటన్‌ నారిమన్‌, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ వి బాలసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఇచ్చిన తన తీర్పు స్పష్టం చేసింది. మణిపూర్‌కు చెందిన మంత్రి కేసులో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 

టి.శ్యామ్‌కుమార్‌ అనే నేత 2017లో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ అధికారంలోకి రావడంతో వెంటనే పార్టీ ఫిరాయించి, బీజేపీలో చేరడంతో అటవీ శాఖకు మంత్రి కూడా అయిపోయారు. ఈ విషయంపై కాంగ్రెస్‌ 
స్పీకర్‌ను కలిసి అనర్హత వేటు వేయాలని పిటిషన్‌ పెట్టుకుంది. స్పీకరు ఇప్పటివరకూ అట్టిపెట్టుకున్నారు తప్ప తేల్చలేదు. 

ఈ అంశంపై కాంగ్రెస్‌ మొదట మణిపూర్‌ హైకోర్టును ఆశ్రయించగా స్పీకర్ల అధికారాలకు సంబంధించిన అంశం ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ముంగిట పెండింగ్‌లో ఉందంటూ జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. దాంతో కాంగ్రెస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేర 3నెలల్లోగా నిర్ణయం ప్రకటించాలని తీర్పు చెప్పింది.