అయోధ్యలో వివాదాస్పద రామజన్మ భూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీం కోర్టు శనివారం(నవంబర్-9,2019)తీర్పు ఇవ్వనుంది. 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేసినప్పటి నుండి దశాబ్దాల అనిశ్చితికి సుప్రీం ముగింపు పలికింది. తీర్పు సందర్భంగా ఇవాళ(నవంబర్-8,2019)ఉదయం భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఉత్తరప్రదేశ్ ఉన్నతాధికారులతో సమావేశమై శాంతిభద్రతల ఏర్పాట్లపై చర్చించారు.
అయోధ్య వివాదం పరిష్కారం కోసం ఏర్పాటైన మధ్యవర్తిత్వ కమిటీ వివాదానికి స్నేహపూర్వక పరిష్కారం కనుగొనడంలో విఫలమైన అనంతరం భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 6 నుంచి ఈ కేసుపై రోజువారీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. 40రోజులు సుప్రీంకోర్టులో ఈ కేసుపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం రోజువారీ విచారణ చేపట్టింది. అయోధ్య కేసులో సుప్రీం కోర్టులోఅక్టోబర్-16,2019న వాదనలు ముగిసిన విషయం తెలిసిందే.
అయితే శాంతి భద్రతల దృష్యా అయోధ్య నగరంలో ఇప్పటికే 144 సెక్షన్ ను విధించారు. అయోధ్యపై సుప్రీం తీర్పుతోపాటు బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం ఉన్న సందర్భంగా డిసెంబర్-10,2019వరకు అయోధ్యలో 144 సెక్షన్ విధించారు. అయోధ్యలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించారు. అయోధ్యలో తీర్పు అనంతరం బాణసంచా కాల్చకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అయోధ్య తీర్పు దృష్ట్యా ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలను హోంశాఖ అలర్ట్ చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యకు కూడా ఇప్పటికే 4వేల మంది పారామిలిటరీ దళాలను తరలించింది కేంద్ర హోంశాఖ. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది కేంద్రం.