Suvendu Adhikari Convoy Attacked In Nandigram Allegedly By Tmc Workers
Suvendu Adhikari పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నందిగ్రామ్‌కు రెండో దశలో భాగంగా ఇవాళ(ఏప్రిల్-1,2021)పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. సువేందు కాన్వాయ్ వెంటే ఉన్న మీడియా వాహనం ఈ రాళ్ల దాడిలో ధ్వంసమైంది. నందిగ్రామ్‌లోని సతేన్‌గబరి ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అయితే ఈ ఘటనలో సువేందు మాత్రం గాయపడలేదు.
మరోవైపు పశ్చిమ మిడ్నాపూర్‌లో మరో బీజేపీ అభ్యర్థి ప్రీతిశరంజన్ కోనార్ కాన్వాయ్‌పై కూడా దాడి జరిగినట్లు సమాచారం. ఇక, పశ్చిమ మిడ్నాపూర్‌లోని తృణమూల్ పార్టీ కార్యాలయం ముందు టీఎంసీ కార్యకర్త ఉత్తమ్ హత్య చేయబడ్డాడు. బీజేపీ నేతలు తమ కార్యకర్తను చంపారని టీఎంసీ ఆరోపిస్తోంది. ఇక, నందిగ్రామ్ లోని బేకుటియా ప్రాంతానికి చెందిన బీజేపీ కార్యకర్త ఉదయ్ దూబే గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయ్ దూబే బీజేపీ స్టార్ క్యాంపెయినర్ మిథున్ చక్రవర్తి రోడ్ షో కు హాజరైన తర్వాత టీఎంసీ నుంచి బెదిరింపులు రావడంతో తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని, ఇతని ఆత్మహత్యకు టీఎంసీనే కారణమని బీజేపీ నేతలు ఆరోపించారు.
బీజేపీ కార్యకర్త ఆత్మహత్య వెనుక టీఎంసీ ఉందని సువెందు అధికారి ఆరోపించారు .కాగా ఉదయ్ దూబే కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని టీఎంసీ నేతలు అంటున్నారు. పోలీసులు బీజేపీ కార్యకర్త మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే మరణానికి కారణం తెలుస్తుందని పోలీసులు చెప్పారు.
కాగా, రెండో విడతలో భాగంగా బెంగాల్‌లో నందిగ్రామ్ సహా 30 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 2016 ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి టీఎంసీ అభ్యర్థిగా బరిలో దిగిన సువేందు అధికారి 67శాతం ఓట్లు దక్కించుకుని విజయం సాధించారు. ఈ సారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సువెందు.. 50 వేల ఓట్ల మెజార్టీ సాధించి మమత బెనర్జీని ఓడిస్తానని…అలా జరగకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. మమతా బెనర్జీ తన సిట్టింగ్ స్థానాన్ని వదులుకొని నందిగ్రామ్ నుంచి బరిలో దిగారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది.