అమెరికాలో స్వచ్ఛ అభియాన్ : మోడీపై నెటిజన్ల ప్రశంసలు

అమెరికా పర్యటనలో భాగంగా శనివారం రాత్రి 11 గంటల సమయంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ హూస్టన్‌ చేరుకున్న విషయం తెలిసిందే. హ్యూస్టన్‌ జార్జి బుష్‌ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. ట్రేడ్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ ఓల్సన్‌, భారత్ లో యూఎస్‌ రాయబారి కెన్నత్‌ జెస్టర్‌, అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్‌, ప్రవాస భారతీయులు మోడీకి హృదయపూర్వక ఆహ్వానం పలికారు. కాగా ఈ ఆహ్వాన కార్యక్రమంలో ప్రధాని చేసిన చిన్న చర్య అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్‌ మీడియాలో మోడీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

విమానం నుంచి అభివాదం చేస్తూ బయటకు నడుచుకుంటూ వచ్చిన మోడీ…అక్కడి అధికారులను పరిచయం చేసుకుంటూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. అయితే ఈ సమయంలో ఓ మహిళా మోడీకి అందించిన పూలబొకేలోని పుష్పాలు కార్పెట్‌పై పడ్డాయి. వెంటనే ప్రధాని స్పందించి వాటిని తీసి తన భద్రతా సిబ్బందికి అందించారు. ప్రధాని చర్యను మెచ్చుకుంటూ సోషల్‌ మీడియాలో ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు చాలా గ్రేట్ సార్….ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినవారు…ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి అంటూ మోడీని మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. అమెరికాలో స్వచ్చ అభియాన్ చేపట్టిన మోడీ అంటూ ప్రశంసిస్తున్నారు.