Taliban about Kashmir: కశ్మీరీల గురించి మాట్లాడే హక్కు మాకుంది – తాలిబన్

భారత్ తో సత్సంబంధాలు కొనసాగిస్తామని చెబుతూనే కశ్మీర్ పై ప్రశ్నిస్తామని, అది తమ హక్కు అని చెబుతున్నారు తాలిబాన్లు. కశ్మీర్‌ సహా ప్రపంచంలోని....

Taliban About Kashmir

Taliban about Kashmir: భారత్ తో సత్సంబంధాలు కొనసాగిస్తామని చెబుతూనే కశ్మీర్ పై ప్రశ్నిస్తామని, అది తమ హక్కు అని చెబుతున్నారు తాలిబాన్లు. కశ్మీర్‌ సహా ప్రపంచంలోని ముస్లింల హక్కుల కోసం గళమెత్తుతామని ప్రకటించారు. ఏ దేశానికి వ్యతిరేకంగా సాయుధ చర్యలు చేపట్టే విధానం తమకు లేదని చెప్తున్నారు.

అఫ్గానిస్తాన్ తిరిగి తాలిబన్‌ పాలనలోకి పోగా ఉగ్రముప్పు ఉందని భారత్ లో భయాందోళనలు మొదలయ్యాయి. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబన్‌ ప్రతినిధి సుహైల్‌ షహీన్‌ దీని గురించి మాట్లాడారు. ఇటీవలే ఖతార్‌లో భారత రాయబారితో భేటీ అయిన తాలిబన్లు..అఫ్ఘాన్‌ నేలపై ఉగ్రకార్యకలాపాలు చేయమంటూ హామీ ఇచ్చారు. కశ్మీర్‌ భారత అంతర్గత విషయమని, జోక్యం చేసుకోబోమని గతంలో తాలిబన్ల ప్రకటనతో తాజా ప్రకటన విభేదిస్తుండడం ఆందోళన కలిగించే అంశమని నిపుణులు భావిస్తున్నారు.

భారత వ్యతిరేక హక్కానీ నెట్‌వర్క్‌పై సైతం తాలిబన్ల స్వరం మారింది. హక్కానీలపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారాలని తాజా ఇంటర్వ్యూలో సుహైల్‌ చెప్పారు.

పంజ్‌షీర్ మొత్తం తాలిబన్ల సొంతం:
ఇన్నాళ్లూ ప్రత్యర్థులుగా నిలిచి పోరాడిన పంజ్‌‌షీర్‌ లోయ వాసులపై సైతం ఆధిక్యం సాధించారు తాలిబన్లు. దీంతో పూర్తి పట్టు సాధించామని తాలిబన్‌ కమాండర్‌ శుక్రవారం ప్రకటించారు. కీలకమైన పంజ్‌‌షీర్‌ తమ వశం కావడంతో కాబూల్‌లో తుపాకులను గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారు.

అఫ్గానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్లు శనివారం ప్రకటించనున్నారు. కొత్త సర్కారు అధినేతగా ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ పేరు తెరపైకి వచ్చింది. తాలిబన్‌ ముఠా సహ వ్యవస్థాపకుడైన బరాదర్‌ ప్రస్తుతం దోహాలోని తాలిబన్‌ రాజకీయ కార్యాలయ చైర్మన్‌గా ఉన్నాడు. అఫ్గానిస్తాన్‌ నుంచి సైనిక బలగాల ఉపసంహరణపై గత ఏడాది అమెరికాతో జరిగిన చర్చల్లో కీలకంగా వ్యవహరించాడు.