Tamil Nadu Assembly Elections : కమల్ హాసన్ మేనిఫెస్టో, గృహిణులకు శిక్షణ..పీపుల్స్ క్యాంటీన్ ప్రాజెక్టు

కమల్‌ హాసన్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీది మయ్యం కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపించింది..

Kamal Haasan Manifesto : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లపై ఉచిత వరాల జల్లులు కురుస్తూనే ఉన్నాయి.. కమల్‌ హాసన్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీది మయ్యం కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపించింది.. అధికారంలోకి రాగానే తాము ఏం చేయబోతున్నామో తెలుపుతూ MNM మేనిఫెస్టోను విడుదల చేసింది. తమిళనాడులో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయబోతారో నేతలు వివరిస్తున్నారు. ఓ వైపు ప్రధాన పార్టీలన్ని ఉచిత హామీల వర్షం కురిపిస్తుంటే.. తాను మాత్రం నేలను వీడిచి సాము చేయనంటూ ఎక్కువగా ఉచితాల జోలికి పోలేదు కమల్‌ హాసన్‌.. మక్కల్ నీది మయ్యమ్‌ విడుదల మేనిఫెస్టోను ఇదే స్పష్టమవుతుందన్నారు కమల్‌. అయితే మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ తన మేనిఫెస్టోను విడుదల చేసింది MNM.

గృహిణులకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇస్తామని.. దీని ద్వారా మహిళలు ప్రతినెలా 10 నుంచి 15 వేల వరకు సంపాదించుకునేలా శిక్షణ ఇప్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు MNM అధినేత కమల్ హాసన్. పీపుల్స్ క్యాంటీన్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అందులో, మిలటరీ క్యాంటీన్ మాదిరిగా, ప్రజలకు సరసమైన ధరలకు సరఫరా చేస్తామన్నారు. అసంఘటిత కార్మికులను ఒక సంస్థగా తీసుకురావాలన్నది తమ కోరిక అని కమల్ వివరించారు. చిన్న వ్యాపారాలకు ముడి పదార్థాలు సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు.

రాష్ట్రంలో ఒక రాజధాని ప్రాంతమే కాకుండా….అన్ని నగరాలను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు కమల్‌. ఇప్పటికే తమిళనాడుపై 6 లక్షల కోట్ల రుణ భారం ఉన్నందునా.. అదనపు మినహాయింపులు ప్రకటించినట్లయితే భారం పెరుగుతుందన్నారు. తమిళనాడులో వివాదస్పదమైన నీట్‌ పరీక్షపై కూడా మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు కమల్‌.. నీట్ పరీక్షకు ప్రత్యామ్నాయంగా, సీట్ అనే ప్రవేశ పరీక్ష ప్రవేశపెడతామని… దీనిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేలా చూస్తామన్నారు.

ఇటీవలే డీఎంకే-MNM పార్టీల మధ్య మేనిఫెస్టో వార్‌ నడిచింది.. డీఎంకే విడుదల చేసిన స్టాలిన్‌ విజన్‌ డాక్యుమెంట్‌పై కమల్‌ విమర్శల వర్షం కురిపించారు.. తమ హామీలను డీఎంకే కాపీ కొట్టిందన్నారు.. ఏదేమైనా తమ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అధికారం కట్టబెడుతుందన్న ధీమాలో ఉన్నారు కమల్‌. MNM అధినేత కమల్ హాసన్ కోయంబత్తూర్‌ సౌత్‌ నుంచి బరిలో దిగారు. ఆయన పార్టీ మొత్తం 154 సీట్లో పోటీ చేయగా…మిగతా సీట్లలో కూటమిలో ఇతర పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు