రేపు ఉదయం 5గంటల వరకు జనతా కర్ఫ్యూ పొడగింపు

సోమవారం(మార్చి-22,2020)ఉదయం 5గంటల వరకు జనతా కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు ఇవాళ మధ్యాహ్నాం జారీ చేసిన నోటిఫికేషన్ లో ఆ రాష్ట్రం పేర్కొంది. ఈ విషయంలో ప్రజలందరూ సహకరించాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది.

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటలవరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూని పాటించాలని రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపుమేరకు ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. దేశవ్యాప్తంగా ప్రజారవాణ కూడా నిలిచిపోయింది.

మరోవైపు తెలంగాణలో రేపు ఉదయం వరకు జనతా కర్ఫ్యూ కొనసాగుతుందని శనివారం సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక కర్ణాటక రాజధాని బెంగళూరు కమిషనరేట్ పరిధిలో ఇవాళ రాత్రి 9గంటల నుంచి 12గంటలవరకు 144సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. 

ఇవాళ్టితో ఆగకుండా మార్చి-31వరకు పూర్తిగా ప్యాసింజర్ రైళ్లను నిలిపివేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. మార్చి-31,2020వరకు ఆయా రాష్ట్రాలు ఆర్టీసీ సర్వీసులను కూడా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.ఇప్పటికే కేంద్రం అంతర్జాతీయ విమానసర్వీసులన్నింటినీ రద్దు చేసింది. సరిహద్దులను కూడా మూసివేసింది. దాదాపు భారత్ పూర్తిగా షట్ డౌన్ అయింది.