Tamil Nadu Stampede
Tamil Nadu Stampede : తమిళనాడులో ఘోర విషాద ఘటన జరిగింది. కరూర్‌లో సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ప్రచారసభ సందర్భంగా శనివారం రాత్రి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. వీరిలో 16మంది మహిళలు, ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. అనేక మంది గాయపడ్డారు. 58మంది కరూర్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతన్నారని అధికారులు తెలిపారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని, వీరికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
తొక్కిసలాట ఘటనలో గాయపడి కరూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని తమిళనాడు సీఎం స్టాలిన్ పరామర్శించారు. మృతదేహాలకు నివాళులర్పించి.. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున.. గాయపడిన వారికి లక్ష రూపాయల చొప్పున పరిహారంను సీఎం స్టాలిన్ ప్రకటించారు. మరోవైపు.. తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు. రిటైర్డ్ న్యాయమూర్తి అరుణా జగదీశన్ నేతృత్వంలో విచారణ కొనసాగనుంది. కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా విజయ్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Also Read: Karur Stampede: నా గుండె ముక్కలైంది.. కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ ఫస్ట్ రియాక్షన్..
తొక్కిసలాటకు ప్రధాన కారణాలపై సీఎంకు పోలీసులు ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. మధ్యాహ్నం 12గంటలకు జరగాల్సిన ర్యాలీ.. ఆలస్యంగా రాత్రి 7గంటలకు ప్రారంభమైంది. ర్యాలీ ఆలస్యం కారణంగా తాగునీరు, ఆహారం లేకపోవడంతో చాలా మంది కార్యకర్తలు స్పృహ కోల్పొయారని, వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్సుకు దారిలేని పరిస్థితి ఏర్పడిందని ప్రాథమిక నివేదికలో పోలీసులు పేర్కొన్నట్లు తెలిసింది. ర్యాలీకి వచ్చిన వెంటనే రెండుసార్లు తన ప్రసంగాన్ని నిలిపివేసిన విజయ్.. ఒకసారి నీళ్ళు, మరోసారి తప్పిపోయిన చిన్నారిని వెతకాలంటూ కోరారు. చిన్నారిని వెతికే క్రమంలో మొదలై అలజడి మరింత గందరగోళంతో తొక్కిసలాట మొదలైందని పోలీసులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు.. తొక్కిసలాట ఘటనలో మరణించిన 39మంది మృతదేహాలకు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి.. కుటుంబ షభ్యులకు మృతదేహాలను అధికారులు అప్పగించారు.
విజయ్ కారణంగానే తొక్కిసలాట.. రాష్ట్ర డీజీపీ
కరూర్ ఘటనపై తమిళనాడు రాష్ట్ర డీజీపీ వెంకటరామన్ మాట్లాడుతూ నివేదిక ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. కరూర్ ర్యాలీకి మేము విధించిన ఏ నిబంధనలను టీవీకే పార్టీ విజయ్ పాటించలేదని చెప్పారు. మేము భద్రత కల్పించాం కాబట్టే హైవే నుండి కరూర్ ర్యాలీ ప్రాంగణానికి విజయ్ చేరుకున్నారు. పోలీసులు లేకుంటే ర్యాలీ ప్రాంగణానికి రాకుండా పోయేవాడినని విజయ్ స్వయంగా సభలో మాట్లాడుతూ మాకు కృతజ్ఞతలు తెలిపారు. కరూర్ లో తొక్కిసలాటకు ప్రధాన కారణం విజయ్ ఆలస్యంగా రావడమే. మధ్యాహ్నం12 గంటలకు ర్యాలీ అని ట్వీట్ చేసి.. రాత్రి 7 గంటల 20 నిమిషాలకు విజయ్ ర్యాలీ వద్దకు చేరుకున్నారు. దీంతో భారీగా అక్కడ జన సమీకరణ చేశారు. పదివేల మందికి అనుమతి కోరి.. దాదాపు 30వేల మందికిపైగా అక్కడ జనసమీకరణ చేశారని, 600 మంది పోలీసులతో తాము రక్షణ కల్పించామని డీజీపీ వెంకటరామన్ చెప్పారు. నివేదిక ఆధారంగా చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు.
విజయ్‌పై కుట్రలో భాగమే..
టీవీకే అధ్యక్షుడు విజయ్ కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూడలేకనే అతనిపై కుట్రలో భాగంగా ఈ ఘటన జరిగిందని, దీని వెనుక స్టాలిన్ ప్రభుత్వం ఉందని టీవీకే పార్టీ నేతలు ఆరోపించారు. తొక్కిసలాట ఘటనకు కారణం ముమ్మాటికీ స్టాలిన్ ప్రభుత్వమేనని చెబుతున్నారు. మేడు అడిగిన ప్రాంతంలో కాకుండా చిన్నపాటి రోడ్డులో ర్యాలీ జరుపుకోవాలని చెప్పారు. విజయ్ సభ జరుగుతున్న సమయంలో కావాలనే అంబులెన్సులను జనం మధ్యలో నుంచి తీసుకొని వెళ్లేలా చేశారు. విజయ్ అంబులెన్సుకు దారి వదలాలని చెప్పడంతో జనం మధ్యలో నుంచే అంబులెన్సులు వెళ్లాయి. అందుకే తొక్కిసలాట జరిగింది. పోలీసులతో కలిసి డీఎంకే ప్రభుత్వం విజయ్ పై కుట్ర పన్నిందని టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. తొక్కిసలాట ఘటన తరువాత చెన్నైలోని టీవీకే పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.