MNM అభ్యర్థుల జాబితా రిలీజ్..కోయంబత్తూరు నుంచి కమల్ పోటీ

Tamil Nadu Polls Kamal Haasan To Contest From Coimbatore South1
Tamil Nadu Polls తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ శుక్రవారం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న ఎమ్ఎన్ఎం పార్టీ..154 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి (ఏఐఎస్ఎంకే), ఇందియ జయనాయగ కట్చి పార్టీలతో కలిసి ఎన్ఎన్ఎం ఎన్నికల బరిలో దిగుతోంది. రాష్ట్రంలో మొత్తం 234 స్థానాలకు గాను 154 స్థానాల్లో పోటీ చేస్తున్న ఎంఎన్ఎం… మిత్రప క్షాలైన ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి (ఏఐఎస్ఎంకే), ఇందియ జయనాయగ కట్చి పార్టీలకు చెరో 40 స్థానాలను కేటాయించింది. ఇక తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి కమల్‌హాసనేనని ఏఐఎస్ఎంకే చీఫ్ శరత్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు.
ఎంఎన్ఎం అధినేత కమల్‌హాసన్ కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి తొలిసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగుతున్నారు. తొలుత కమల్ హాసన్ చెన్నై నుంచి బరిలోకి దిగుతారన్న ప్రచారం జరిగింది. అయితే ఇవాళ కమల్ హాసన్ కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించి ఊహాగానాలకు తెరదింపింది ఎంఎన్ఎం.
మరోవైపు, ఇవాళ ఉదయం..తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకే 173స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలుండగా.. సీట్ల సర్దుబాటులో భాగంగా డీఎంకే 173 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. మిగతా 61 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. డీఎంకే అధినేత స్టాలిన్ ఎప్పటిలాగే కొలతూరు స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్.. తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు తాత కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన చెన్నైలోని చెపాక్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఏప్రిల్-6న ఒకే దశలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.