భిక్షమెత్తిన డబ్బులతో సమాజసేవ : కరోనా నిధికి విరాళాలు ఇస్తున్న మానవతామూర్తులు

భిక్షమెత్తిన డబ్బులన్నీ యాచకులు ఏం చేస్తుంటారు. దాచుకుంటారు. కానీ..కొంతమంది మాత్రం సమాజానికి మంచి చేసే పనులు కూడా చేస్తుంటారనే వార్తలు పెద్దగా రావు. కానీ కరోనా కష్టకాలంలో కొంతమంది భిక్షగాళ్లు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. మేము సైతం కరోనాను తరిమికొట్టటానికి ముందుననాం అంటున్నారు. అటువంటి ఓ భిక్షగాడు పూల్ పాండియన్. వయస్సు 80పైనే ఉంటుంది. పూల్ పాండియన్ ది చాలా పెద్ద మనస్సు. యాచించగా వచ్చిన డబ్బుల్ని పొదుపు చేస్తుంటాడు.వాటిని మంచి పనులకు వినియోగిస్తుంటాడు. అలా కరోనా నివారణకు ఉపయోగించే సహాయనిధికి రూ.10వేలు విరాళంగా ఇచ్చాడు పాండియన్.
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా ఆలంకినరుకు చెందిన చుట్టుపక్కల ప్రాంతాల్లో భిక్షమెత్తుకుంటూంటాడు. అలా సంపాదించిన డబ్బుల్ని తన ఖర్చులకు పోగా మిగిలిన డబ్బుని పొదుపుచేస్తాడు. అలా చేసిన రూ.10 వేలు విరాళంగా ఇచ్చాడు.
తన ఖర్చులకు పోగా మిగిలిన సొమ్మును పొదుపు చేస్తూ..పలు స్కూళ్లకు టేబుళ్లు, కుర్చీలు, నీటి శుద్ధీకరణ యంత్రాలకు కావాల్సిన డబ్బులను స్కూల్ మేనేజ్ మెంట్ వారికి ఇస్తుంటాడు.
మూడు నెలల క్రితం మదురైకి వచ్చిన పాండియన్ పలు ప్రాంతాల్లో భిక్షాటన చేస్తుండటం చేస్తుండటం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చూశారు. వెంటనే నిర్వాసితుల శిబిరానికి తరలించారు. తరువాత సదరు అధికారులతో పాండియన్ మాట్లాడుతూ..సార్..దయచేసి ఈ రూ.10 వేలను కరోనా నివారణ నిధికి అందజేయాలని కోరుతు ఆ డబ్బుని అధికారులకు అందజేశాడు.
పంజాబ్ లోని పఠాన్ కోట్ లోని రాజు అనే వికలాంగ భిక్షగాడు కూడా కరోనా కష్టకాలంలో స్థానికంగా ఉండే 100 పేద కుటుంబాలకు నెలకు సరిపడా రేషన్..మరో మూడు వేలమంది పేదలకు మాస్క్ లు కొని ఇచ్చి తన పెద్ద మనస్సుని చాటుకున్నాడు.
అలాగే ఒడిశాలో బ్లాక్‌లోని ఏకటాలా గ్రామంలో నివసిస్తున్న సరోజినీ దాస్ అనే 75 ఏళ్ల భిక్షమెత్తుకునే మహిళ కరోనా సహాయనిధికి రూ.5వేలను విరాళంగా ఇచ్చింది. అంతేకాదు వితంతువులకు పెన్షన్ ఇచ్చే ఓ ప్రెస్ క్లబ్ కు రూ.2వేలు ఇచ్చింది. అలాగే స్థానికంగా ఉండే నిరాశ్రయులకు ఆమె స్వయంగా వంటచేసి వారి ఆకలి తీరుస్తుంటుంది.
ఇలా భిక్షగాళ్లేకదాని తేలిగ్గా తీసిపారేయటనాకి లేదు. కష్టకాలంలో మన కుటుంబాలు ఎలా గడుస్తాయిరా బాబూ అని మనం అంతా భయపడుతున్నాం..తన డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టకుంటున్నాం. కానీ కొంతమంది భిక్షగాళ్లు మాత్రం మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కరోనా యోధులుగా పనిచేస్తున్నారు.