చైనాలో చిక్కుకున్న తెలుగు ఇంజనీర్లు : ఆందోళనలో పేరెంట్స్

  • Publish Date - January 29, 2020 / 12:40 PM IST

చైనాలో వ్యాపించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది.  దీని ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను తాకింది. చైనాలోని వ్యూహావ్ నగరంలో  తెలుగు రాష్ట్రాల యువ ఇంజనీర్లు చిక్కుకుపోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.

వివరాల్లోకి వెళితే TCL కంపెనీ ఇటీవల క్యాంపస్ సెలక్షన్స్ లో భాగంగా Engineering College ల నుంచి యువ ఇంజనీర్లను రిక్రూట్ చేసుకుంది. వారిలో 96 మందిని శిక్షణ కోసం చైనా లోని వ్యూహన్ కు పంపించింది. మొదటి విడతలో శిక్షణ పూర్తి చేసుకున్న 38మంది నవంబర్ లో భారత్ కి తిరిగి వచ్చారు. మరో 58 మంది వ్యూహన్ లోనే ఉండి శిక్షణ పొందుతున్నారు.

ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ ప్రబలటంతో వారిని సొంతూరుకు పంపుదామని TCL సంస్ధ ప్రయత్నించినప్పటికీ నిషేధం అమల్లోకి రావటంతో వారిని చైనాలోనే ఉంచాల్సి వచ్చింది. దీంతో భారత్ లోని వారి తల్లి తండ్రులు ఆందోళన చెందుతున్నారు. వీరిలో తిరుపతికి చెందిన యువ ఇంజనీర్ విష్ణుప్రియ కూడా ఉంది.  ప్రస్తుతం తామంతా గది వదిలి బయటకు రావటంలేదని, వ్యూహన్ నగరం అంతా దిగ్భందంలో ఉందని..తాము క్షేమంగానే ఉన్నామని ఆమె తన తండ్రి సుబ్రహ్మణ్యానికి తెలిపింది.

చైనాలో చిక్కుకున్న తన కుమార్తెతో పాటు మిగిలిన వారిని ఇండియా రప్పించేందుకు కృషి చేస్తున్నట్లు సుబ్రహ్మణ్యం చెప్పారు.  కాగా.. గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ సృష్టిస్తున్న కలకలం అంతా ఇంతాకాదు. ప్రపంచ దేశాలు కరోనా బారిన పడకుండా ముందు జాగత్తలు తీసుకుంటున్నాయి.