“మనది లౌకిక దేశం” అంటూ ఆ పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

మతాలకు అతీతంగా అందరికీ తమ మార్గదర్శకాలు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Supreme Court

Supreme Court: న్యాయస్థాన అనుమతి లేకుండా భవనాల కూల్చివేత చర్యలు చేపట్టవద్దని ఇటీవల తాము ఇచ్చిన మధ్యంతర స్టే.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కొనసాగుతున్న ‘బుల్డోజర్ చర్యల’పై పిటిషన్లు రాగా దీనిపై విచారణ కొనసాగించిన సుప్రీంకోర్టు మంగళవారం తీర్పును రిజర్వ్ చేసింది.

ఇటీవల ‘బుల్డోజర్ చర్యల’పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం అక్టోబర్ 1 వరకు కోర్టు అనుమతి లేకుండా కూల్చివేతలపై స్టే విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ దీనిపై మరోసారి విచారణ చేపట్టి దీనిపై వాదనలను ముగించింది.

ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అన్నింటి కన్నా ప్రజా భద్రతే ముఖ్యమని తెలిపింది. మందిరమైనా, దర్గా అయినా, ఇతర ఏ మతపర కట్టడమైనా సరే ప్రజలకు ఇబ్బందులు కలిగిచకూడదని చెప్పింది. మతంతో సంబంధం లేకుండా తగిన మార్గదర్శకాలను ఇస్తామని తెలిపింది.

మనది లౌకిక దేశమని, మతాలకు అతీతంగా అందరికీ తమ మార్గదర్శకాలు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రహదారి మధ్యలో ఏదైనా మతపరమైన నిర్మాణం ఉందంటే.. అది గురుద్వారానైనా దర్గా లేదా దేవాలయమైనా సరే ప్రజలకు ఆటంకాలు కలిగించకూడదని పేర్కొంది.

ప్రజల భద్రతే అత్యంత ముఖ్యమని తెలిపింది. అక్రమ నిర్మాణాలపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పింది. చట్టాల నిబంధనలు మతం లేదా ఏదైనా విశ్వాసాలపై ఆధారపడి ఉండవని జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. దేశంలోని అందరికీ వర్తించేలా మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేస్తామని తెలిపారు. నిందితుడు లేదా దోషి అయినంత మాత్రాన అతడికి/ఆమెకు సంబంధించిన నిర్మాణాలను కూల్చివేయలేం కదా? అన్న విషయంపై తమ మార్గదర్శకాలలో స్పష్టంగా తెలుపుతామని పేర్కొంది.

శ్రీవారి “లడ్డూ కల్తీ” పిటిషన్లపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నారంటే?