సరిహద్దుల్లో మళ్లీ టెన్షన్ : సైన్యాన్ని తరలిస్తున్న కేంద్రం

  • Publish Date - February 20, 2019 / 05:56 AM IST

ఢిల్లీ : భారత సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. ఇప్పటికే పుల్వామా దాడితో టెర్రరిస్టులు రెచ్చిపోతే, కాల్పుల విరమణకు ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాక్  సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. జమ్మూకశ్మీర్ రాజౌరీ సెక్టార్‌లో పాక్ కాల్పులకు తెగబడింది. దీంతో ఎలాంటి పరిస్థితినైనా దీటుగా ఎదుర్కొనేందుకు భారత బలగాలు సిద్ధమవుతున్నాయి. ఎల్‌వోసీలో బలగాలు మోహరిస్తున్నాయి. 

మరోవైపు  పుల్వామాలో  జవాన్లపై ఉగ్రదాడికి భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదంపై పోరుకు భారత్‌కు ప్రపంచ దేశాలు బాసటగా నిలుస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుల్వామా దాడిని ఖండించారు. టెర్రర్ అటాక్‌ను భయానక చర్యగా అభివర్ణించిన ట్రంప్ ఈ దాడికి కారణమైన పాకిస్థాన్‌ను శిక్షించాల్సిందేనన్నారు.పుల్వామా దాడిపై నివేదికలు పరిశీలించామని ట్రంప్ అన్నారు. మరోవైపు న్యూజీలాండ్ కూడా ఉగ్రదాడిని ఖండించింది. పుల్వామా ఘటనలో చనిపోయిన జవాన్లకు న్యూజిలాండ్‌ పార్లమెంట్‌ సంతాపం తెలిపి భారత్ కు మద్దతు తెలిపింది. తీవ్రవాదానికి మద్దతు పలికే చర్యలను మానుకోవాలంటూ పాకిస్థాన్‌కు హితవు పలికింది. తీవ్రవాదంపై జరిపే పోరులో భారత్‌కు సహకరిస్తామని న్యూజిలాండ్‌  పార్లమెంట్ ప్రకటించింది.