శబరిమలలో కరోనా కలకలం…భారీగా పాజిటివ్ కేసులు

Thirty-nine Covid positive cases so far in Sabarimala శబరిమల అయ్యప్ప ఆలయంలో కరోనా కలకలం రేపింది. భక్తులతో పాటు ఆలయసిబ్బంది, పోలీసులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వార్షిక పూజల కోసం నవంబరు 16 నుంచి శబరిమలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ మహమ్మారి మొదలైన తర్వాత వార్షిక పూజల కోసం శబరిమల ఆలయం తెరుచుకోవడం ఇదే తొలిసారి.



ఈ నేపథ్యంలో నాటి నుంచి ఇప్పటివరకు మొత్తం 39 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని ట్రావెన్‌కోర్‌ దేవస్థాన బోర్డు (టీడీబీ) శుక్రవారం వెల్లడించింది. వీరిలో 27 మంది ఆలయ సిబ్బందే ఉన్నట్లు తెలిపింది. సన్నిధానం, పంబ, నీలక్కల్‌ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పాయింట్లలో వీరందరికీ పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించారు.



కరోనా సోకిన వారందరినీ శబరిమలలో ఏర్పాటు చేసిన కొవిడ్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు దేవస్థాన బోర్డు తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శబరిమలలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.డాక్టర్లు, స్పెషలిస్టులు, ఆరోగ్య సిబ్బందిని పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంచారు. షిఫ్టుల వారీగా వారు విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ పరీక్షలు చేస్తూ నెగటివ్‌గా నిర్ధారణ అయిన వారిని మాత్రమే కొండపైకి అనుమతిస్తున్నారు.



రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు మొదలు శబరిమలకు దారి తీసే పలు మార్గాల్లో కరోనా పరీక్షల కోసం కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కేరళకు యాత్రికులు చేరుకునే ప్రాంతాలైన తిరువనంతపురం, తిరువళ్ల, చెంగనూర్‌, కొట్టాయం రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో యాంటిజెన్‌ పరీక్షల కోసం ఏర్పాట్లు చేశామని కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు