గోవా అసెంబ్లీ సమావేశాల్లో పులులపై వాడీవేడీగా చర్చ జరిగింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పులులను చంపడంపై బుధవారం అసెంబ్లీలో చర్చించారు. ఈ సందర్భంగా ఎన్సీపీ ఎమ్మెల్యే చర్చిల్ అలెమావో మాట్లాడుతూ.. పులులను కూడా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఆవుల్ని చంపి తింటున్న మనుషులకు శిక్ష విధిస్తున్నప్పుడు పులులపై కూడా శిక్ష విధించాలి కదా? అని సభలో చర్చిల్ ప్రశ్న లేవనెత్తారు. గతనెలలో మహదయి (అభయారణ్యం) వైల్డ్ లైఫ్ శాంచురీలో ఓ ఇంట్లోని ఆవుపై పులి దాడి చేసి చంపింది. దీంతో అక్కడి ఐదుగురు స్థానికులు కర్రలతో తరిమి ఒక పులి సహా దాని మూడు పిల్లలను కొట్టి చంపేశారు. ఈ ఘటనపై సభలో విపక్షనేత దిగంబర్ కామత్ ముందుగా ప్రశ్నలేవనెత్తారు.
అసెంబ్లీ సమావేశం సమయంలో బుధవారం సభలో అటెన్షన్ మోషన్ కు కామత్ పట్టుబట్టారు. ‘ఆవుల్ని చంపి తిన్న మనుషులకు ఎలాంటి శిక్ష విధిస్తారో అలాగే ఆవును చంపి తిన్న పులికి కూడా ఏ శిక్ష విధిస్తారో చెప్పాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. వన్యప్రాణుల కోణంలో ఆలోచిస్తే.. పులులు ఎంతో ముఖ్యమైనవి, కానీ, అదే మనిషి విషయానికి వచ్చే సరికి ఆవులు కూడా వారికి అంతే ముఖ్యమని అలెమావో స్పష్టం చేశారు.
సభలో అటెన్షన్ మోషన్ పై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. గ్రామంలో తమ ఆవులను పులులు చంపి తిన్నాయనే ఆగ్రహంతో స్థానికులు వాటిపై దాడి చేసి చంపారని అన్నారు. పులి దాడిలో ఆవుల్ని కోల్పోయిన రైతులకు మూడు లేదా నాలుగు రోజుల్లో నష్ట పరిహారం అందేలా చేస్తామని సావంత్ చెప్పారు.