ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించనున్న శ్రీరామ మందిర విశేషాలను ప్రత్యేకంగా భద్రపరచనున్నారు. భూగర్భంలోకి రెండు వేల అడుగుల లోతులో తామ్రపత్రాలు(రాగి పలక)ను ఉంచనున్నారు. దీనిలో బంధిత చరిత్ర, తదితర వివరాలు ఉంటాయని మందిర నిర్మాణానికి సారథ్యం వహిస్తున్న శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఓ ప్రకటనలో తెలిపింది. ట్రస్టు సభ్యుడు కామేశ్వ్ చౌపాల్ ఆదివారం రామ జన్మభూమి తీర్థ్ క్షేత్రం గురించి వివరించారు.
ఈ మందిరానికి సంబంధించిన చరిత్రను, వివరాలను తెలుసుకోవాలనుకునే రాబోయే తరాల వారికి ఈ ఏర్పాటు ఉపయోగపడుతుందని అన్నారు. రామ జన్మభూమి, బాబ్రీ మసీదు కేసులో రామ మందిర నిర్మాణానికి అనుమతులు ఇస్తూ సర్వోన్నత న్యాయస్థానం గత సంవత్సరం నవంబర్ 9న తీర్పు వెలువరించింది. అంతేకాకుండా మసీదు నిర్మాణానికి అనువైన ఐదు ఎకరాల స్థలాన్ని వక్ఫ్ బోర్డుకు కేటాయించాల్సిందిగా తీర్పులో పేర్కొంది.
ఈ చారిత్రాత్మిక కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన 9 నెలల అనంతరం.. తొలిసారిగా ఆగస్టు 5న నిర్వహించనున్న భూమి పూజకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఆగస్టు 3న ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసాగనుంది. మందిర నిర్మాణ స్థలంలో ఆలయ గర్భగుడి వద్ద జరిగే భూమిపూజ కార్యక్రమంలో నలభై కిలోల వెండి ఇటుకను ఉపయోగించనున్నారు.
పలు పుణ్యక్షేత్రాల నుంచి తీసుకువచ్చిన మట్టిని, శ్రీరాముడి స్పర్శతో పుణీతమైన నదీ నీళ్లను భూమిపూజకు, అభిషేకానికి వాడనున్నారు.