ఉత్తరాఖండ్ సీఎంగా తీరథ్ సింగ్ ప్రమాణస్వీకారం

Tirath Singh Rawat ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్‌ ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం డెహ్రాడూన్ లోని రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. గవర్నర్ బేబి రాణి మౌర్య..తీరథ్ సింగ్ రావత్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో ఉత్తరాఖండ్ 10వ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తిగా తీరథ్ సింగ్ రావత్ నిలిచారు.

ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తీరథ్ సింగ్ రావత్‌ కి ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. తీరథ్ సింగ్.. విస్తారమైన పరిపాలనా మరియు సంస్థాగత అనుభవాన్ని తనతో తీసుకొస్తాడని మోడీ తెలిపారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందని తనకు నమ్మకం ఉందని మోడీ ట్వీట్ చేశారు.

56 ఏళ్ల తీరథ్ సింగ్ రావత్.. ప్రస్తుతం గర్హ్వాల్ ఎంపీగా ఉన్నారు. గతంలో 2013 నుంచి 2015 వరకు ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. ఎమ్మెల్యేగానూ సేవలందించారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న తీరథ్ సింగ్ రావత్‌‌కు ఉత్తరాఖండ్ లో‌ బలమైన బీసీ సామాజికవర్గ నేతగా పేరుంది.

కాగా, సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతి ఎదుర్కోవడంతో మంగళవారం ఉత్తరాఖండ్ సీఎం పదవికి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ ఉదయం డెహ్రాడూన్‌లోని బీజేపీ కార్యాలయంలో శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి కొత్త సీఎంగా తీరథ్ సింగ్‌ను ఎన్నుకున్నారు. సీఎం పదవి కోసం పలువురు ఆశావాహుల పేర్లను పరిశీలించి,చివరకు తీరథ్ వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గుచూపింది. ఉత్తరాఖండ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందు సీఎంను మార్చడం చర్చనీయాంశంగా మారింది.