Tomato Virus
Tomato Virus: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పిల్లలకు టమాటా వైరస్ వ్యాపిస్తోంది. పిల్లల చేతులు, కాళ్లు, నోటిలో ఎర్రటి మచ్చలు, దద్దుర్లు వస్తున్నాయి. దీని వల్ల పిల్లల్లో జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనపడుతున్నాయి.
భోపాల్‌లోని అనేక పాఠశాలలు ఈ వ్యాధిపై అలర్ట్ జారీ చేశాయి. పిల్లల్లో లక్షణాలు కనపడితే వారిని పాఠశాలకి పంపవద్దని తల్లిదండ్రులకు సూచనలు చేస్తున్నాయి.
దీనిపై ఓ పిల్లల వైద్యులు మాట్లాడుతూ… “టమాటా వైరస్ లేదా ఫీవర్ అంటే సాధారణ భాషలో హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్. ఈ వ్యాధి ఎకోనివైరస్, కాక్స్‌సాకీ వైరస్ వల్ల కలుగుతుంది. ఇది సాధారణంగా 6 నెలల నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లో ఉంటుంది. జ్వరం వస్తుంది.. చేతులు, కాళ్లు, నోరు లోపల రాషెస్ ఏర్పడతాయి” అని చెప్పారు.
Also Read: తెలంగాణ సీఎం సీటు కోసం ట్రై చేస్తారా? మనసులోని మాటను చెప్పేసిన డీకే అరుణ
టామాటా ఫ్లూ ఉన్న వ్యక్తిని తాకడం, దగ్గరగా ఉండడం ద్వారా వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వైరస్ ఉన్న పిల్లల్లో జ్వరం, జలుబు లక్షణాలు కూడా కనిపిస్తాయి. దగ్గు, తుమ్ముల ద్వారా కూడా వైరస్ ఇతరులకు అంటుతుంది.
ఇది ప్రాణాంతక వ్యాధి కాకపోయినప్పటికీ, చికిత్స అవసరమని తెలిపారు. సరైన సమయంలో చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు. ఇప్పటికే వైరల్ ఇన్ఫెక్షన్, హార్ట్, లంగ్స్ వ్యాధులు ఉన్న పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అంటున్నారు. వ్యాధి 6-8 రోజుల్లో తగ్గుతుంది. భోపాల్‌లోని కొందరు ప్రీ స్కూల్ పిల్లల్లో టమాటా వైరస్ కనిపించింది.