Indian Railways
Train journeys: రైలు టికెట్ ధరలు ఈ నెల 26 నుంచి పెరగనున్న విషయం తెలిసిందే. 215 కిలోమీటర్ల వరకు టికెట్ల ధర మారదు. అంతకంటే ఎక్కువ దూరం ఉన్న టికెట్ల ధరలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేయాలనుకునేవారు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. డిసెంబర్ 26 తర్వాత ప్రయాణం కోసం అడ్వాన్స్ బుక్ చేసుకున్న వాళ్లు కూడా ఇప్పుడు పెంచిన ధరలను కట్టాలా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారిక ప్రకటన ఏం చెబుతోంది?
డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వచ్చే టికెట్ ధరల పెంపు విషయంలో, ఇప్పటికే బుక్ చేసిన టికెట్లపై కొత్త చార్జీలు వర్తిస్తాయా? లేదా? అనే అంశంపై రైల్వే శాఖ ఇప్పటివరకు ప్రత్యేక సర్క్యులర్ విడుదల చేయలేదు. ప్రెస్‌నోట్‌లోనూ దీనిపై స్పష్టత ఇవ్వలేదు.
అయితే, గతంలో అమలు చేసిన చార్జీల పెంపు సందర్భాలను పరిశీలిస్తే స్పష్టత వస్తోంది. 2025 జులై 1, నుంచి అమల్లోకి వచ్చిన చార్జీల పెంపు సమయంలో.. అప్పటికే బుక్ చేసుకున్న టికెట్లపై అదనపు చార్జీలు వసూలు చేయబోమని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అంటే, టికెట్ బుక్ చేసిన తేదీ నాటి చార్జీలే వర్తించాయి.
ఈ నేపధ్యంలో, డిసెంబర్ 26కి ముందే టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులపై కూడా అదే విధానం అమలు అయ్యే అవకాశం ఉంది. అదనంగా చార్జీలు పడకుండా ఉండాలంటే టికెట్ ఇప్పటికే కన్ఫర్మ్ లేదా రిజర్వ్ అయి ఉండాలి. అలాగే, టికెట్‌ను రద్దు చేసి, మళ్లీ బుక్ చేయకూడదు. సాధారణంగా మొదటి నుంచి, ప్రయాణికులు బుకింగ్ చేసిన తేదీ నాటి చార్జీలను అలాగే ఉంచే విధానాన్ని అనుసరిస్తూ వస్తోంది రైల్వే శాఖ. పీఆర్ఎస్, యూటీఎస్, ప్రత్యక్ష టికెటింగ్ వ్యవస్థలను దీనికి అనుగుణంగా నవీకరిస్తారు.
ప్రయాణానికి ముందు పీఎన్‌ఆర్ స్టేటస్‌ను ప్రయాణికులు చెక్ చేసుకోవాలి. ప్రయాణ తేదీ, కోచ్, క్లాస్ లేదా స్టేషన్లలో మార్పులు చేస్తే కొత్త చార్జీలు వర్తించే అవకాశం ఉంది. డిసెంబర్ 26కి ముందు బుక్ చేసిన టికెట్లపై కొత్త చార్జీలు వర్తించే అవకాశం అంతగా లేదు.