త్వరలో హిందీ, కన్నడ భాషల్లో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్(SVBC) ప్రసారాలను దేశవ్యాప్తంగా ప్రసారం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు SVBC బోర్డు సమావేశం అన్నమయ్య భవనంలో జరగగా.. బోర్డ్ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పిల్లలు, యువతలో ధార్మికతను పెంపొందించేలా కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయాలని SVBCని యాడ్ ఫ్రీ ఛానెల్‌గా మార్చాలని, SVBC ట్రస్టుకు విరాళాలను స్వీకరించాలని సమావేశం నిర్ణయం తీసుుంది. త్వరలో తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శ్రీమద్భగవద్గీత, గరుడ పురాణం పారాయణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని, శ్రీవారి కళ్యాణోత్సవ సేవను త్వరలోనే ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
అలాగే కళ్యాణోత్సవ టికెట్లు కొనుగోలు చేసిన భక్తుల ఇళ్లకు శ్రీవారి ప్రసాదం, అక్షింతలు తదితర పూజా సామగ్రి పంపించేందుకు చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, SVBC ఎండీ ఏవీ ధర్మారెడ్డి, ఎఫ్‌ఏ, సీఏవో బాలాజీ, బోర్డు సభ్యులు స్వప్న, శ్రీనివాసరెడ్డి, సీఈవో వెంకటనగేష్ పాల్గొన్నారు.