Polyandry: హిమాచల్ ప్రదేశ్‌లోని షిల్లాయ్ గ్రామంలో హట్టి తెగకు చెందిన అన్నదమ్ములు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహానికి వందలాది మంది తరలివచ్చారు. వీరి జంటను ఆశీర్వదించారు. వధువు సునీతా చౌహాన్.. వరులు ప్రదీప్, కపిల్ నేగి తమపై ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు. ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నట్లు వారు వెల్లడించారు. అన్నదమ్ములు ఒకే అమ్మాయిని పెళ్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇప్పుడీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎందుకిలా? అసలేంటీ ఆచారం? ఆ వివరాల్లోకి వెళితే..
జూలై 12న సిర్మౌర్ జిల్లాలోని ట్రాన్స్-గిరి ప్రాంతంలో ఈ పెళ్లి జరిగింది. మూడు రోజుల పాటు ఈ వేడుక కొనసాగింది. స్థానిక జానపద పాటలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వివాహ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ రెవెన్యూ చట్టాలు ఈ సంప్రదాయాన్ని గుర్తించాయి. దీనికి “జోడిదారా” అని పేరు పెట్టాయి. ట్రాన్స్-గిరిలోని బధానా గ్రామంలో గత ఆరేళ్లలో ఈ తరహా వివాహాలు ఐదు వరకు జరిగాయి.
”నాకు ఈ సంప్రదాయం గురించి తెలుసు. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. నా సొంతంగా నిర్ణయం తీసుకున్నా. మా మధ్య ఏర్పడిన బంధాన్ని నేను గౌరవిస్తాను” అని కున్హాట్ గ్రామానికి చెందిన వధువు సునీత అన్నారు. షిల్లై గ్రామానికి చెందిన వరుడు ప్రదీప్ ప్రభుత్వ శాఖలో పని చేస్తున్నారు. మరో వరుడు అతని తమ్ముడు కపిల్ విదేశాల్లో జాబ్ చేస్తున్నారు. “మేము ఈ సంప్రదాయాన్ని బహిరంగంగా అనుసరించాము. ఎందుకంటే మేము దాని గురించి గర్వపడుతున్నాము. ఇది ఉమ్మడి నిర్ణయం” అని ప్రదీప్ అన్నారు. నేను విదేశాల్లో నివాసం ఉంటున్నప్పటికీ.. ఈ వివాహం ద్వారా మా భార్యకు మద్దతు, ప్రేమను అందిస్తానని కపిల్ తెలిపారు.
ఈ ఆచారాన్ని హట్టి కమ్యూనిటీ వారు ఫాలో అవుతారు. దీన్ని జోడీదారా అని అంటారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అన్నదమ్ములు ఒకే భార్యను కలిగి ఉండొచ్చు. ఇక కాపురం ఎలా చేస్తారు అనే పెద్ద డౌట్ రావొచ్చు. దానికి వారు పరస్పర అంగీకారం చేసుకుంటారు. భార్యను రాత్రికి లేదా వారానికి ఓసారి మార్చుకుంటారు. ఇక పిల్లలకు అన్నదమ్ముల్లో పెద్దవాడిని తండ్రిగా పరిగణిస్తారట. ఇక ఈ విధానం దేనికోసం అంటే.. పూర్వీకుల భూమి ముక్కలు కాకూడదని స్థానికులు చెబుతారు.
హట్టి అనేది హిమాచల్ ప్రదేశ్-ఉత్తరాఖండ్ సరిహద్దులో ఉన్న ఒక సమాజం. మూడు సంవత్సరాల క్రితం షెడ్యూల్డ్ తెగగా ప్రకటించబడింది. ఈ తెగలో, బహుభర్తృత్వం (ఒక మహిళ ఒకరికన్నా ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండటం) శతాబ్దాలుగా ఆచరణలో ఉంది. కానీ మహిళల్లో అక్షరాస్యత పెరగడం, ఈ ప్రాంతంలోని వర్గాల ఆర్థిక పురోగతి కారణంగా బహుభర్తృత్వ కేసులు తగ్గిపోయాయి. ఇటువంటి వివాహాలు రహస్యంగా జరుగుతాయని, సమాజం వాటిని అంగీకరిస్తుందని, కానీ అలాంటి సందర్భాలు తక్కువగా ఉంటాయని గ్రామంలోని పెద్దలు తెలిపారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ సంప్రదాయం వెనుక ప్రధానమైన కారణం ఉంది. పూర్వీకుల భూమిని విభజించబడకుండా చూసుకోవడం అందులో ఒకటి. పూర్వీకుల ఆస్తిలో గిరిజన మహిళల వాటా ఇప్పటికీ ప్రధాన సమస్యగా ఉంది.
సిర్మౌర్ జిల్లాలోని ట్రాన్స్ గిరి ప్రాంతంలోని దాదాపు 450 గ్రామాల్లో హట్టి కమ్యూనిటీకి చెందిన దాదాపు 3 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో బహుభర్తృత్వం ఇప్పటికీ ఆచరించే సంప్రదాయం. ఇది ఉత్తరాఖండ్‌లోని గిరిజన ప్రాంతం జౌన్సర్ బాబర్, హిమాచల్ ప్రదేశ్‌లోని గిరిజన జిల్లా కిన్నౌర్‌లో కూడా ప్రబలంగా ఉంది. ఒక కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని మరింత విభజించకుండా కాపాడటానికి వేల సంవత్సరాల క్రితం ఈ సంప్రదాయాన్ని కనుగొన్నారని హట్టి కమ్యూనిటీ ప్రధాన సంస్థ కేంద్రీయ హట్టి సమితి ప్రధాన కార్యదర్శి కుందన్ సింగ్ శాస్త్రి తెలిపారు.
వేర్వేరు తల్లులకు పుట్టిన ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులను ఒకే వధువును వివాహం చేసుకోవడం ద్వారా ఉమ్మడి కుటుంబంలో సోదరభావం, పరస్పర అవగాహనను ప్రోత్సహించడం మరొక కారణం.
మూడవ కారణం భద్రతా భావం. “పెద్ద కుటుంబం, ఎక్కువ మంది పురుషులు ఉంటే, గిరిజన సమాజంలో మరింత సురక్షితంగా ఉంటారు” అని కుందన్ సింగ్ అన్నారు. ఇది దూర ప్రాంతాల్లో చెల్లాచెదురుగా ఉన్న వ్యవసాయ భూములను నిర్వహించడంలో కూడా సహాయపడుతుందన్నారు. ఆ భూముల సంరక్షణకు, సాగుకు చాలా కాలం పాటు కుటుంబం అవసరం” అని ఆయన వివరించారు.
గిరిజన కుటుంబాల ఈ అవసరాలు.. వేల సంవత్సరాలుగా బహుభర్తృత్వ వ్యవస్థను నిలుపుకునేలా చేశాయి. అయితే ఈ సంప్రదాయాలు నెమ్మదిగా మరణిస్తున్నాయని శాస్త్రి అన్నారు. “జాజ్దా” అని పిలువబడే ఈ ప్రత్యేకమైన గిరిజన వివాహ సంప్రదాయంలో, వధువు ఊరేగింపుగా వరుడి గ్రామానికి వస్తుంది. “సీంజ్” అని పిలువబడే ఆచారాన్ని వరుడి నివాసంలో నిర్వహిస్తారు.
పండితులు స్థానిక భాషలో మంత్రాలను జపిస్తూ వధూవరుల మీద పవిత్ర జలాన్ని చల్లుతారు. చివరలో వారికి బెల్లం నైవేద్యం పెడతారు. వారి కుల దేవత వారి వివాహ జీవితంలో మాధుర్యాన్ని తీసుకురావాలని ఆశీర్వదిస్తారు.