నేడు మహా సీఎంగా ఉద్దవ్ థాక్రే ప్రమాణస్వీకారం : రైతులు, వితంతువులకు ఆహ్వానం

మరికొద్దిగంటల్లో శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే.. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబై శివాజీ పార్కులో జరిగే ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు

  • Publish Date - November 28, 2019 / 03:03 AM IST

మరికొద్దిగంటల్లో శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే.. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబై శివాజీ పార్కులో జరిగే ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు

మరికొద్దిగంటల్లో శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే.. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబై శివాజీ పార్కులో జరిగే ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా సహా పలువురు ప్రముఖులు, రైతులు, వితంతువులు హాజరుకానున్నారు.

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న శివసేన కల మరి కొద్దిగంటల్లో తీరనుంది. ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే గురువారం(నవంబర్ 28,2019) సాయంత్రం 6గంటల 40 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబై శివాజీ పార్కులో జరిగే బహిరంగ సభలో ఉద్ధవ్‌తో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే దసరా ప్రసంగాలను ఈ మైదానంలోనే చేసేవారు. అందుకే ఇదే స్థలాన్ని ఉద్ధవ్ తన ప్రమాణ స్వీకారానికి వేదికగా ఎంచుకున్నారు. 

ఇటీవల చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల అనంతరం ఉద్ధవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి మార్గం సుగమం అయింది. బీజేపీకి మద్దతిచ్చి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ యూ టర్న్ తీసుకోవడంతో శివసేన గట్టెక్కింది. కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో అధికార పగ్గాలు చేపడుతోంది. ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగే కేబినెట్ సమావేశంలో కొత్త స్పీకర్ ఎన్నికకు తేదీని ఖరారు చేయనున్నారు.

ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ఏర్పడబోయే ప్రభుత్వంలో తొలి రెండున్నరేళ్లు ఎన్సీపీ… డిప్యూటీ సీఎం పదవిలో ఉండనుంది. శివసేన నుంచి 15 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారని సమాచారం. ఎన్సీపీ నుంచి డిప్యూటీ సీఎం, 13 మంది మంత్రులు ఉండనుండగా.. కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ పదవితోపాటు 13 మంత్రి పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే…గురువారం పరిమిత సంఖ్యలో మంత్రులతో ఉద్ధవ్ ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది. ఉద్ధవ్ తోపాటు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన నుంచి ఇద్దరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. శివసేన నుంచి సుభాష్ దేశాయ్, ఏక్ నాథ్ షిండే.. ఎన్సీపీ నుంచి జయంత్ పాటిల్, చగన్ భుజ్ బల్.. కాంగ్రెస్ నుంచి అశోక్ చవాన్, బాలా సాహెబ్ థోరట్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. డిసెంబర్ 3 తర్వాత కేబినెట్ విస్తరణ జరగనుంది.

ఉద్ధవ్ ప్రమాణ స్వీకారానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీఎంకె నేత ఎంకె స్టాలిన్ తదితరులు హాజరుకానున్నారు. ఉద్దవ్ కుమారుడు ఆదిత్య.. స్వయంగా సోనియాను, మన్మోహన్‌సింగ్‌ను కలిసి ఆహ్వానించారు. అయితే… కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం ఉద్దవ్ ప్రమాణ స్వీకార వేడుకకు దూరంగా ఉంటారని తెలుస్తోంది.

ఉద్దవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి.. ఆహ్వానం అందుకున్న రైతులు, వితంతువులు తరలిరానున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఉద్దవ్ కలిసిన రైతులను కూడా ప్రమాణ స్వీకార వేడుకకు ఆహ్వానించినందున… మహారాష్ట్రలోని ప్రతి జిల్లా నుంచి కనీసం 20 మంది చొప్పున రైతులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు.. పోలీసులు శివాజీ పార్క్ దగ్గర పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.