మోడీ టార్చర్ భరించలేకే సుష్మా,జైట్లీ చనిపోయారు : ఉదయనిధి స్టాలిన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేతలు హద్దులు మీరుతున్నారు. ప్రత్యర్థులపై హాట్ కామెంట్స్ చిక్కుల్లో పడుతున్నారు.

Udhayanidhi Stalin తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేతలు హద్దులు మీరుతున్నారు. ప్రత్యర్థులపై హాట్ కామెంట్స్ చిక్కుల్లో పడుతున్నారు. డీఎంకే ఎంపీ ఏ. రాజా..సీఎం పళనిస్వామి,ఆయన తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యల రగడ చల్లారకముందే.. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తనయుడు, యువనేత ఉదయనిధి స్టాలిన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

చెపాక్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుం తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్న ఉదయనిధి స్టాలిన్ గురువారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సీనియర్లంటే ఏమాత్రం గౌరవం లేదన్నారు. ఆయన వేధింపుల కారణంగా కేంద్ర మాజీ మంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ప్రాణాలు కోల్పోయారని ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. బీజేపీలో మరో కీలక నేత అయిన వెంకయ్య నాయుడిని కూడా మోడీ పక్కకు తప్పించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా..మిస్టర్ మోడీ.. మీమ్మల్ని చూసి భయపడటానికి, చేతులు కట్టుకుని నిల్చోడానికి నేనేమీ సీఎం పళనిస్వామిని కాదు. నేను కలైంగర్ మనవడిని, ఉదయనిధి స్టాలిన్‌ని అని ఘాటైన పదజాలంతో ప్రసంగించారు.

అయితే, ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై సుష్మా స్వరాజ్, అరుణ్‌ జైట్లీ కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు. రాజకీయాల కోసం తమ కుటుంబాలను వాడుకోవద్దని ట్వీట్ లు చేశారు. ప్రధాని మోడీ తమ తల్లికి ఎంతో గౌరవం ఇచ్చారని, కీలక సమయంలో ప్రధాని, బీజేపీ తమ కుటుంబానికి అండగా నిలిచిందని..ఉదయనిధి వ్యాఖ్యలు అవాస్తవమని..ఇవి తమని తీవ్రంగా బాధించాయని సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్ ట్వీట్ చేశారు. మోడీ, అమిత్ షా తమతో ఎలా ఉంటారో మాకు తెలుసునని..ఉదయనిధి వ్యాఖ్యలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదే సమయంలో అరుణ్ జైట్లీ కుమార్తె సోనాలి జైట్లీ బక్షి కూడా ఉయదనిధి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఉయయ్ స్టాలిన్ గారూ.. మీపై ఎన్నికల ఒత్తిడి ఉందని నాకు తెలుసు. కాని మీరు అబద్ధాలు చెప్పి నా తండ్రిని అగౌరవపరిచారు. దీన్ని నేను సహించలేను. నా తండ్రి అరుణ్ జైట్లీ, మోడీ మధ్య రాజకీయాలకు మించిన స్నేహం ఉంది. వారి గురించి కామెంట్స్ చేసే ముందు.. వారి స్నేహం గురించి తెలుసుకుంటే మంచిది అన్నారు.

ఇక,ఏప్రిల్-6న ఒకే దశలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. కాంగ్రెస్‌, వాపక్షాలు, ఎండీఎంకే, వీసీకే వంటి పార్టీలతో కూటమిగా ఏర్పడి ప్రచారంలో దూసుకెళుతోంది.

ట్రెండింగ్ వార్తలు